 
															సజీవ దహనమైన మేకల బూడిద
ఎండ తీవ్రతతో పాటు గాలులు వీయడంతో అప్పటికే ఇళ్లు, మేకల శాలులు మంటల్లో...
భువనేశ్వర్ : ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని హింజిలికాట్ నియోజకవర్గం పరిధిలో గల  లావుగుడ గ్రామంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 ఇళ్లు, రెండు మేకల శాలలు  దగ్ధమైన సంఘటన స్థానికంగా విషాదం మిగిల్చింది. ఈ అగ్ని ప్రమాదంలో 90 మేకలు సజీవ దహనం కాగా లక్షలాది రూపాయల ఆస్తులు ధ్వంసమయ్యాయి.  గ్రామంలో అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న హింజిలికాట్, అస్కా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది తక్షణమే ప్రమాదస్థలానికి చేరుకుని మంటలు అర్పేందుకు శతవిధాలా  ప్రయత్నించారు. ఎండ తీవ్రతతో పాటు గాలులు వీయడంతో అప్పటికే ఇళ్లు, మేకల శాలులు మంటల్లో పూర్తిగా బూడిదయ్యాయి.

బూడిౖదైన మేకల శాల
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  ప్రతినిధి  శరత్ కుమార్ మహపాత్రో, బంజనగర్ సబ్‌కలెక్టర్ రాజేంద్ర మిజ్ఞ, బీడీఓ సురంజిత్ సాహు, అదనపు తహసీల్దార్ శరత్ కుమార్ మల్లిక్ చేరుకుని బాధితులకు తక్షణ సహాయంగా ప్లాస్టిక్ కవర్లు, ఆహారం, బియ్యం,   కట్టుకునేందుకు వస్త్రాలు అందించారు. ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు బిజు పక్కా గృహ పథకం కింద ఇళ్లు ఇవ్వాలని, ప్రమాదంలో సజీవ దహనమైన మేకలకు నష్ట పరిహారం, సహాయం అందించి ఆదుకోవాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న బాధిత  గ్రామస్తులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
