ఆగని కరోనా ఉద్ధృతి

69921 New Coronavirus Positive Cases Registered In India - Sakshi

24 గంటల్లో 69,921 కేసులు

మొత్తం మరణాలు 65,288 

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి దూకుడు ఆగడం లేదు. మంగళవారం తాజాగా మరో 69,921 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36,91,166కు చేరుకుంది. గత 24 గంటల్లో 819 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 65,288 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 28,39,882 కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,85,996గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 21.29శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. మంగళవారానికి ఇది 76.94 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.77 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 31 వరకు 4,33,24,834 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. సోమవారం మరో 10,16,920 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. గతం వారం రోజుల్లోనే అయిదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం 1,583 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గత రెండు వారాల్లో 1.22కోట్ల పరీక్షలు జరిపారు. దేశంలోని మొత్తం పరీక్షల్లో కేవలం తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోనే 34 శాతం పరీక్షలను చేశారని కేంద్రం తెలిపింది. దేశంలో ప్రతి మిలియన్‌ మందికి 31,394 పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. 

30 నిమిషాల్లో ఫలితం.. 
కరోనా ఉందో లేదో కేవలం 30 నిమిషాల్లో తేల్చే పోర్టబుల్‌ మెషీన్‌ ప్రొటోటైప్‌ను అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేశారు. రిజల్ట్‌ కూడా మొబైల్‌ కు మెసేజ్‌ వచ్చేలా, సంబంధిత అధికారులకు కూడా సమాచారం వెళ్లేలా తయారు చేసినట్లు వారు తెలిపారు. ఈ పరిశోధకుల సమూహంలో ఓ భారతీయ మూలాలున్న శాస్త్రవేత్త కూడా ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు పీఎన్‌ఏఎస్‌ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి పరికరాల వల్ల కోవిడ్‌ నిర్థారణ సులువవుతుందని బయో ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ రషీద్‌ బాషిర్‌ తెలిపారు. నిర్ధారణ కోసం గొంతు నుంచి తీసిన ద్రవాన్ని ఇందులో ఉపయోగించనున్నారు.  ఆర్టీ–పీసీఆర్‌తో పోల్చదగ్గ ఫలితాలు ఈ ల్యాంప్‌ పరికరం ద్వారా వచ్చినట్లు వెల్లడించారు. గొంతు నుంచి కాకుండా, లాలాజలం నుంచి నిర్ధారణ పరీక్ష చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు చెప్పారు.   

వ్యాక్సిన్‌పై విముఖత! 
25 శాతం మందిది అదేమాట: అంతర్జాతీయంగా వయోజనుల్లో నలుగురిలో ఒకళ్లు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి విముఖతతో ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. వ్యాక్సిన్‌ సైడ్‌ఎఫెక్ట్స్‌పై భయాలు, పనితీరుపై సందేహాలతో వందకు 25 మంది వ్యాక్సినేషన్‌పై సుముఖంగా లేనట్లు తెలిపింది. అయితే ఇలా విముఖత చూపుతున్నవారు ఇండియాలో కేవలం 13 శాతం మందేనని పేర్కొంది. దాదాపు 27 దేశాల్లో సుమారు 20వేల మంది వయోజనులను ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌– ఇప్సాస్‌ సర్వే చేశాయి. ఈ సంవత్సరంలోనే కరోనా వ్యాక్సిన్‌ వస్తుందని చైనా, సౌదీ, ఇండియాల్లో ఎక్కువమంది ఆశాభావం వ్యక్తం చేసినట్లు సర్వే తేల్చింది.  మొత్తం మీద 59 శాతం మంది ఈ ఏడాది టీకా రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

దాదాపు పావువంతుమంది వ్యాక్సిన్‌పై నమ్మకం లేదనడం ప్రపంచవ్యాప్తంగా అందరికీ వ్యాక్సినేషన్‌ అందివ్వాలన్న లక్ష్యాన్ని దెబ్బతీయవచ్చని డబ్ల్యూఈఎఫ్‌ ప్రతినిధి అర్నౌడ్‌ బెర్నెట్‌ అభిప్రాయపడ్డారు.  వ్యాక్సిన్‌ కావాలని ఎక్కువగా 97 శాతం మంది చైనాలో కోరుకోగా, తర్వాత స్థానాల్లో బ్రెజిల్‌(88 శాతం), ఆస్ట్రేలియా(88 శాతం), ఇండియా(87 శాతం) వాసులు ఉన్నారు. వ్యాక్సిన్‌పై అపనమ్మకం ఎక్కువగా రష్యా(54 శాతం), పోలెండ్‌(56 శాతం), హంగరీ(56 శాతం), ఫ్రాన్స్‌(59 శాతం)వాసుల్లో ఉంది. అయితే ఎక్కువ దేశాల్లో వ్యాక్సిన్‌ కావాలనే వారు వద్దనే వారి కన్నా చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారని ఈ సర్వే తెలిపింది. వ్యాక్సిన్‌ వద్దనుకునేందుకు కారణాల్లో  దుష్ప్రభావాలపై భయం ప్రధమస్థానంలో ఉంది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top