
న్యూఢిల్లీ: ఈ రోజు(ఆదివారం, ఏప్రిల్ 13) ఉదయం ఒక గంట వ్యవధిలో భారతదేశం, మయన్మార్(Myanmar), తజికిస్తాన్‌లలో నాలుగు భూకంపాలు సంభవించాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మొదటి భూకంపం తజికిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు సమీపంలో సంభవించగా, ఆ తర్వాత మయన్మార్‌లోని మీక్టిలాలో, అనంతరం భారతదేశంలోని జమ్మూ కశ్మీర్‌లోగల కిష్ట్వార్‌లో, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూకంపాలు నమోదయ్యాయి. ఈ భూకంపాల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.
తజికిస్తాన్(Tajikistan)లో భూకంప తీవ్రత 6.0గా నమోదయ్యింది. దేశంలోని ఫైజాబాద్ సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఉదయం 9:00 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక గంటలో సంభవించిన నాలుగు భూకంపాలలో ఇది మొదటిది. మయన్మార్‌లో భూకంపం 5.5 తీవ్రతతో వచ్చింది. మీక్టిలా సమీపంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 2025, మార్చి 28న 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత ఈరోజు తిరిగి బలమైన భూకంపం సంభవించింది. జనం ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.
జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని హిమాలయన్ ప్రాంతంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి నష్టం జరగలేదు. ఇదేవిధంగా ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నాలుగు భూకంపాలు ఒక గంట వ్యవధిలో చోటుచేసుకున్నాయి. ఈ భూకంపాలు భారత ఫలకం యురేషియన్ ఫలకంతో ఢీకొనడం కారణంగా సంభవించే టెక్టోనిక్ కదలికల ఫలితంగా చోటుచేసుకుంటున్నాయి. మయన్మార్‌లో 2025, మార్చి 28న సంభవించిన భూకంపంలో 3,600 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు.
ఇది కూడా చదవండి: Jallianwala Bagh Anniversary: దేశ చరిత్రలో ఘోర అధ్యాయం: ప్రధాని మోదీ