Pig Heart Transplantation To Human Assam Doctor: 25 ఏళ్ల కిందే పంది గుండె అమర్చిన అస్సాం డాక్టర్‌

Before 25 Years Assam Doctor Successfully Transplant Pig Heart For Patient - Sakshi

వారం రోజులు బతికి, ఇన్ఫెక్షన్లతో చనిపోయిన పేషెంట్‌ 

అప్పట్లో డాక్టర్‌ ధనిరామ్‌ తగిన అనుమతులు తీసుకోకపోవడంతో వివాదం 

నాటి పరిశోధనలకు గుర్తింపు ఉంటే.. ‘జెనో ట్రాన్స్‌ప్లాంట్‌’రికార్డు’ మనకే వచ్చేది 

గువాహటి: అమెరికాలో గుండె పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చడం, ఆ సర్జరీ విజయవంతమై సదరు వ్యక్తి సొంతంగా ఊపిరిపీల్చుకోగలగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అవయవ మార్పిడికోసం ఎదురుచూస్తున్నవారిలో భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది. అమెరికా శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారన్న ప్రశంసలను కురిపిస్తోంది.

కానీ ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే.. పెద్దగా సాంకేతికత అందుబాటులో లేని కాలంలోనే.. మన దేశానికి చెందిన ఓ వైద్యుడు ఈ సర్జరీ చేశాడు. ఓ 32 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను విజయవంతంగా అమర్చగలిగాడు. కానీ తాను చేసిన కొన్ని పొరపాట్లతో ఆ ఘనతను తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. పైగా పోలీసు కేసులు, జైలు శిక్షను ఎదుర్కొన్నాడు. లేకుంటే ప్రపంచంలో తొలి ‘హార్ట్‌ జెనో ట్రాన్స్‌ప్లాంట్‌ (జంతువుల అవయ వాలను మనుషులకు అమర్చడం)’ చేసిన వైద్యుడిగా నిలిచేవాడు. ఇంతకీ ఆ వైద్యుడు ఎవరో తెలుసా.. అస్సాంలోని సోనాపూర్‌కు చెందిన వైద్యుడు ధనిరామ్‌ బారువా. ప్రస్తు తం 68 ఏళ్ల వయసున్న ఆయన అప్పట్లో ఏం చేశారు, ఏం జరిగిందో తెలుసుకుందామా.. 

ప్రపంచస్థాయి వైద్యుడాయన.. 
అస్సాం రాజధాని గువాహటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివారు పట్టణం సోనాపూర్‌. ‘టైం కంటే ముందుండే డాక్టర్‌’గా పేరుపొందిన డాక్టర్‌ ధనిరామ్‌ బారువా అక్కడ సొంతంగా ‘ధనిరామ్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అప్లైడ్‌ హ్యూమన్‌ జెనెటిక్‌ ఇంజనీరింగ్‌’ వైద్య కళాశాలను నడుపుతుండేవారు. 1980వ దశకంలోనే ఆయన ప్రపంచంలోని గొప్ప గుండె వైద్య నిపుణుల్లో ఒక రిగా పేరు పొందారు. గుండెలో దెబ్బతిన్న వాల్వ్‌ల స్థానంలో అమర్చేందుకు 1989లోనే కృత్రిమంగా ‘బారువా హార్ట్‌ వాల్వ్‌’లను అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వాల్వ్‌లను ఇప్పటికీ వినియోగిస్తున్నారు కూడా. ఇదేకాదు సొంతంగా మరెన్నో పరిశోధనలూ చేశారు. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ కూడా ధనిరామ్‌ను పలుమార్లు ప్రశంసించారు కూడా. కానీ 1997లో ఆయన చేసిన ప్రయోగంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 

అనైతికం, ప్రమాదకరమంటూ.. 
ధనిరామ్‌ బారువా 1997 జనవరిలో హాంగ్‌కాంగ్‌కు చెందిన జోనాథన్‌ హోకీ షింగ్‌ అనే హార్ట్‌ సర్జన్‌తో కలిసి సంచలన ప్రయోగం చేశారు. గుండెకు రంధ్రంపడిన ఓ 32 ఏళ్ల వ్యక్తికి సర్జరీ చేసి.. పంది గుండెను అమర్చారు. ఇప్పుడున్నంతగా వైద్య వసతుల్లేని ఆ కాలంలో, అదీ తన వైద్య కళాశాల లోనే ధనిరామ్‌ విజయవంతంగా ఈ సర్జరీ చేయ డం విశేషం. పంది గుండెతో వారం రోజుల పాటు బతికిన ఆ పేషెంట్‌.. పలు రకాల ఇన్ఫెక్షన్ల కార ణంగా వారం రోజుల తర్వాత చనిపోయాడు. ఇది ఒక్కసారిగా ఆందోళనలు రేపింది. మనుషులకు పంది గుండె అమర్చడం అనైతికమని, సదరు పేషెంట్‌ మరణానికి ధనిరామ్‌ కారణమంటూ విమర్శలు వచ్చాయి. 

ఆ పొరపాటుతో కేసులు, జైలు.. 
అప్పటికే ప్రపంచస్థాయి హార్ట్‌ సర్జన్‌ అయిన ధని రామ్‌ ‘జెనో ట్రాన్స్‌ప్లాంటేషన్‌’కు సంబంధించి ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదు. అంతే కాదు.. తన పరిశోధనల వివరాలను ఉన్నతస్థాయి సమీక్ష లకు పంపకుండానే, నేరుగా పంది గుండె అమర్చే సర్జరీ చేశారు. దీంతో ఆయనపై, ఆస్పత్రిపై కేసులు నమోదయ్యాయి. 40రోజులు జైల్లో ఉన్నాక బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ అప్పటికే ఆందో ళనకారులు ఆయన ఆస్పత్రిని, ఆస్తులను ధ్వంసం చేశారు. నీళ్లు, కరెంటు అందకుండా చేశారు. ఆ సమయంలో సుమారు ఏడాదిన్నర పాటు ఆయన ఇంట్లోంచి బయటికి రాకుండా గడపాల్సి వచ్చింది. 

‘వివాదాస్పద’ ఆవిష్కరణలతో.. 
తన ఆస్పత్రి దెబ్బతిన్నా, తనపై ఎన్నో ఆరోపణలు చేసినా.. ధనిరామ్‌ తన పరిశోధనలు కొనసాగిం చాడు. కొన్ని ఆవిష్కరణలు చేసినట్టుగా ప్రకటిం చాడు. కానీ వాటిపై పలు వివాదాలు తలెత్తాయి. పుట్టుకతో వచ్చే గుండె సమస్యలను సరిచేసే జన్యు మార్పిడి వ్యాక్సిన్‌ను రూపొందించినట్టు 2008లో ధనిరామ్‌ ప్రకటించారు. హిమాలయాల్లోని ఔషధ మొక్కల నుంచి హెచ్‌ఐవీని నియం త్రించే జన్యువు లను సేకరించామని..86మందిలో హెచ్‌ఐవీని నిర్మూలించగలిగామని 2015లో ప్రకటించారు.  

ముందుచూపున్న మేధావి 
డాక్టర్‌ ధనిరామ్‌ బారువా ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి అని, కానీ తగిన జాగ్రత్తలు, నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని అస్సాంకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణుడు గోస్వామి చెప్పా రు. ధనిరామ్‌ 25 ఏళ్ల కింద అంతంత మాత్రం సదుపాయాలతో గుండె మార్పిడి చేశారని.. అదే ఇన్నేళ్లలో అభివృద్ధి చెందిన సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీతో అమెరికా వైద్యులు పంది గుండెను మనిషికి అమర్చారని గుర్తు చేశారు. తన పరిశోధనలను పూర్తిస్థాయి సమీక్షలకు పంపక పోవడంతో అధికారిక గుర్తింపు పొందలేకపోయారని పేర్కొన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top