మ్రియాను మించి.. ఆకాశాన ఏతెంచి...

An-225: Worlds Largest Plane Destroyed In Russia Ukraine War - Sakshi

383 అడుగులు

ఏ విమానం ఎంత పెద్దదంటే..

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానం ధ్వంసమైంది. సోమవారం ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో ఆంటోనోవ్‌ ఏఎన్‌–225 మ్రియా విమానం ధ్వంసమైంది. అయితే అంతకన్నా పెద్ద విమానం స్ట్రాటో లాంచ్‌ ఇటీవల అమెరికాలో నింగిలోకి ఎగిరింది. ఆ విమానం ఎలా ఉంటుంది.. అది ఎక్కడ, ఎంత ఎత్తుకు ఎగిరింది. దాన్ని ఎవరు రూపొందించారు. అనే ఆసక్తికర విషయాలేంటో చూద్దాం! 
–సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

స్ట్రాటోలాంచ్‌ అనే బాహుబలి విమానాన్ని ఇటీవల అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో విజయవంతంగా పరీక్షించారు. మోజవ్‌ ఎయిర్‌ స్పేస్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన ఈ విమానం గంటా 43 నిమిషాలపాటు గగనతలంలో చక్కర్లుకొట్టింది. గరిష్టమైన 15వేల అడుగుల ఎత్తుకు వెళ్లి విన్యాసాలు చేసింది. దీన్ని ఇప్పటిదాకా మూడుసార్లు పరీక్షించగా, తాజాగా నాలుగోసారి కాలిఫోర్నియాలో పరీక్షించారు.

దీని రెక్కల పొడవు 383 అడుగులు (117 మీటర్లు). సాధారణంగా ఫుట్‌బాల్‌ స్టేడియం 345 అడుగుల వెడల్పుతో ఉంటే ఇది అంతకన్నా పెద్దగా ఉంటుంది. 50 అడుగుల ఎత్తుతో ఉండే ఈ విమానంలో బోయింగ్‌ 747లో ఉన్నటువంటి ఇంజిన్‌ ఉంటుంది. ఇది 2,26,796 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండు విమానాలను కలిపితే ఎలా ఉంటుందో చూడ్డానికి ఇది అలానే ఉంటుంది.

ఆపరేషనల్‌ స్థాయికి సమీపించినట్లే... 
స్ట్రాటోలాంచ్‌ను నాలుగోసారి ప్రయోగించినప్పుడు మొదటిసారి విమానంలోని అన్ని ల్యాండింగ్‌ గేర్లను ఉపసంహరించుకోవాలని భావించారు. అయితే ఒక గంట తర్వాత విమానంలో వైబ్రేషన్‌ సమస్యతోపాటు వార్నింగ్‌లైట్‌ రావడంతో అనుకున్న సమయానికంటే ముందుగానే వెనుదిరిగింది. దీంతో మోజవ్‌ ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా ల్యాండ్‌ అయింది.

విమానంలో ఇద్దరు పైలట్లతోపాటు ఒక ఫ్లైట్‌ ఇంజనీర్‌ ఉన్నారు. విమానం ఫుల్‌ ల్యాండింగ్‌ గేర్‌ ఉపసంహరణ స్థాయి వరకు వచ్చిందంటే ఇది ఆపరేషనల్‌ స్థాయికి సమీపించినట్టేనని, మొత్తమ్మీద ఇది విజయవంతమైందని స్ట్రాటోలాంచ్‌ అధ్యక్షుడు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జకరీ క్రెవోర్‌ చెప్పారు. 2017 మేలో దీన్ని తొలిసారి పరీక్షించారు.

వచ్చే ఏడాది మధ్యనాటికల్లా... 
మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు పాల్‌ అలెన్‌కు చెందిన సంస్థ దీన్ని రూపొందించింది. 2023 మధ్యనాటికల్లా దీన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ హైపర్‌సోనిక్‌ విమానం అనేక సంప్రదాయ రక్షణ వ్యవ స్థలను సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు  వేగం గా ఆయుధాలను చేరవేయగలదు.

2011లో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని తొలుత రూ.2,250 కోట్లుగా భావించగా, 2019 నాటికి 3 వేల కోట్లకు చేరిందని అంచనా. ఈ విమానం అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లగలదు. తన రెక్కల ద్వారా ఒకేసారి 3 శాటిలైట్‌ రాకెట్‌లను తీసుకెళ్లే లక్ష్యంతో దీన్ని చేపట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top