బాణసంచా యూనిట్‌లో పేలుడు 13 మంది మృతి | 13 killed in fireworks unit blast in Kerala ahead of Thrissur Pooram | Sakshi
Sakshi News home page

బాణసంచా యూనిట్‌లో పేలుడు 13 మంది మృతి

Apr 22 2026 3:15 AM | Updated on Apr 22 2026 3:15 AM

13 killed in fireworks unit blast in Kerala ahead of Thrissur Pooram

త్రిస్సూర్‌ పూరమ్‌ వేడుక కోసం తయారు చేస్తుండగా ఘటన

త్రిస్సూర్‌: కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలోని ఓ బాణసంచా తయారీ యూనిట్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ముండత్తికోడ్‌లో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల వేళ చోటుచేసుకున్న పేలుడు ఘటనలో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తీవ్రతకు వీరి శరీరాలు ఛిద్రమయ్యాయని సమాచారం. పేలుడు శబ్దాలు కిలోమీటర్ల మేర వినిపించాయి. ఘటనలో ముగ్గురు మహిళలు సహా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 70 శాతం కాలిన గాయాలతో త్రిస్సూర్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ నెల 26వ తేదీన త్రిస్సూర్‌ పూరమ్‌ పండుగ కోసం స్థానిక ఆలయం యాజమాన్యంలో పొలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో బాణసంచా తయారీ చేపట్టారు. పేలుళ్లు ప్రారంభమైన సమయంలో అక్కడ కనీసం 40 మంది ఉన్నట్లు సమాచారం. ఎక్కువ మంది స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు చెబుతున్నారు.

అందరూ సమీప ముండత్తికోడ్, కుందన్నూర్‌ ప్రాంతాలకు చెందిన వారేనని, వలస కార్మికులెవరూ లేరని అధికారులు అంటున్నారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి, వయనాడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement