కొత్తగా 3 రోడ్‌ కం బ్యారేజీలు | - | Sakshi
Sakshi News home page

కొత్తగా 3 రోడ్‌ కం బ్యారేజీలు

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

కర్ణాటకలో సత్ఫలితాలు ఇవ్వడంతో..

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కుడివైపు కర్ణాటక.. ఎడమవైపు తెలంగాణ రాష్ట్రాలకు ఉపయోగపడేలా కృష్ణా, భీమా నదులపై రోడ్‌ కం బ్యారేజీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఉభయులకు మేలు చేకూరేలా ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్‌ మంత్రులు, అధికారుల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. మొత్తం మూడు చోట్ల రోడ్‌ కం బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 4, 5వ తేదీల్లో రెండు రోజులపాటు ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్ట్‌ల సందర్శనకు వస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి తొలి రోజు గురువారం కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో కలిసి ప్రతిపాదిత రోడ్‌ కం బ్యారేజీల నిర్మాణ స్థలాలను పరిశీలించనున్నారు.

కృష్ణాపై ఒకటి.. భీమాపై రెండు..

నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కొల్పూరు–కొడ్తికొండ మధ్య కృష్ణా నదిపై 1.08 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి.. బీమా నదిపై కుసుమర్తి– సుకుర్‌ లింగంపల్లితోపాటు దేవసుగూర్‌లోని తంగిడి వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో ఒక్కొక్కటి చొప్పున బ్యారేజీల నిర్మించాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. కొల్పూరు–కొడ్తికొండ మధ్య రోడ్‌ కం బ్యారేజీకి సుమారు రూ.700 కోట్లు.. మిగతా రెండింటికి దాదాపు రూ.600 కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనాలు సైతం వేసినట్లు తెలిసింది.

జూరాలకు ప్రత్యామ్నాయంగా..

ఉమ్మడి పాలమూరుకు వరప్రదాయిని అయిన జూరాల ప్రాజెక్ట్‌ సామర్థ్యం ఏటేటా తగ్గుతోంది. వరదలతో వస్తున్న ఒండ్రు పేరుకుపోవడం.. పూడిక తీయకపోవడమే ఇందుకు కారణం. ఈ ప్రాజెక్ట్‌ నీటి నిల్వ సామర్థ్యం 9.675 టీఎంసీలు కాగా.. 2.50 టీఎంసీల పూడిక పేరుకుపోయినట్లు 2012లో నిర్ధారించారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఎండా కాలంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్‌ నుంచి విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం సర్వసాధారణంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2024, 2025 వేసవిలో కర్ణాటక ప్రభుత్వం నీరు విడుదల చేసినా.. సగానికంటే తక్కువగానే జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జూరాలకు ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కృష్ణా, భీమా నదులపై మూడు రోడ్‌ కం బ్యారేజీల నిర్మాణానికి అడుగులు పడినట్లు తెలుస్తోంది. వీటి నుంచి జూరాలకు కావాల్సినప్పుడు నీటిని విడుదల చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

కృష్ణా, భీమా నదులపై

ఏర్పాటుకు యోచన

తెలంగాణలో నారాయణపేట,

కర్ణాటకలో రాయచూర్‌ జిల్లాలకు మేలు

ఉభయ రాష్ట్రాలకు తాగు,

సాగు నీరందేలా ఉమ్మడి కార్యాచరణ

ఇదివరకే ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారుల మధ్య ప్రాథమిక చర్చలు

రేపు సీఎం రేవంత్‌, కర్ణాటక మంత్రి బోసురాజు ప్రత్యక్ష పరిశీలన

కృష్ణానదిపై కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ తాలూకాలోని గిరిజాపూర్‌ రోడ్‌ కం బ్యారేజీని 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం 194 గేట్లు అమర్చారు. అదేవిధంగా దేవదుర్గ తాలూకాలో 0.5 టీఎంసీల సామర్థ్యంతో గుగల్‌, ఆల్మట్టి డ్యాం కింది భాగంలోని బాగల్‌కోట్‌ జిల్లా పరిధిలో ఆరు టీఎంసీల సామర్థ్యంతో హిప్పర్గి రోడ్‌ కం బ్యారేజీలు నిర్మించారు. మరికొన్ని సైతం నిర్మాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మట్టి దిగువన మూడు ప్రధాన బ్యారేజీలతో జూరాల వైపు ఆఫ్‌ సీజన్‌లో రీజనరేటెడ్‌ వాటర్‌ ఆశించినంత రావడం లేదు. అయినా రోడ్‌ కం బ్యారేజీలతో కర్ణాటకలోని పలు ప్రాంతాలకు సంబంధించి తాగు, సాగు నీటి అవసరాలు తీరుతున్నాయి. అంతేకాకుండా రోడ్‌ కం బ్యారేజీలతో కనెక్టివిటీ పెరగడం.. పలు ప్రాంతాలకు దూరాభారం తగ్గుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం రోడ్‌ కం బ్యారేజీల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వీటితో కుడివైపున కర్ణాటకలో సాగు నీటితోపాటు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లకు నీరు సరఫరా చేసుకునే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement