నారాయణపేట: రాష్ట్ర అభివృద్ధిలో శాంతిభద్రతల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనేకమంది అమరుల త్యాగాలు, దీర్ఘకాల ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షలతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన వెనుక ఉన్న సామాజిక, రాజకీయ పోరాటాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రత్యేక రాష్ట్రం అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా పరిపాలనా వ్యవస్థ మరింత ప్రజలకు చేరువైందని పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రతకు ప్రత్యేక విభాగాలు, డయల్ 100, 112 సేవలు ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తున్నాయని వివరించారు. పోలీసులు తమ విధులను కేవలం ఉద్యోగంగా కాకుండా వృత్తి ధర్మంగా భావించి ప నిచేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజలే పోలీసుశాఖకు నిజమైన బలమని సేవాభావంతో పని చేయాలని సిబ్బందికి సూచించారు. వేడుకల అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (డీఏఆర్) ఎండీ రియాజ్ హూల్‌హక్, డీఎస్పీలు ఎన్.లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, రాంలాల్, సైదులు, ఆర్‌ఐలు నర్సింహ, విజయభాస్కర్, ఎస్సైలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సేవా పతకాలు పొందిన పోలీసులు..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ సేవా పతకాలకు సైదులు (సీఐ, కోస్గి), ఏబీ సురేందర్‌బాబు ( ఏఎస్‌ఐ, కృష్ణా) ఎం.సాయిబాబా (ఏఎస్‌ఐ, ఊట్కూర్) ఎండీ ముస్తాక్ అలీ ( ఏఎస్‌ఐ, ధన్వాడ), డి.మురళీధర్ (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, డీఏఆర్), ఎం.వెంకటేశ్వర్లు (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, డీఏఆర్), బాలరాజు (హెడ్ కానిస్టేబుల్, ఊట్కూర్) ఎండీ లయాక్ అహ్మద్ (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, డీఏఆర్) ఎంపికయ్యారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని ఉత్తమ సేవలు అందుకొని జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


