భక్తిశ్రద్ధలతో ఈద్‌ ఉల్‌ ఫితర్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో ఈద్‌ ఉల్‌ ఫితర్‌

Mar 22 2026 5:27 AM | Updated on Mar 22 2026 5:27 AM

బందోబస్తు పర్యవేక్షించిన డీఎస్పీ..

ఈద్గాల వద్ద ముస్లింలప్రత్యేక ప్రార్థనలు

శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు

నారాయణపేట: జిల్లావ్యాప్తంగా శనివారం రంజాన్‌ పండుగ (ఈద్‌ ఉల్‌ ఫితర్‌)ను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాలు, మండల కేంద్రాలు, పుర కేంద్రాల్లోని మసీదులు, ఈద్గాల వద్దకు ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నా పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈద్గాల వద్ద మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.

గొప్ప పండుగల్లో రంజాన్‌ ఒకటి..

పవిత్ర రంజాన్‌ మాసం దీక్షలు ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతాయని.. చెడు భావన, అధర్మం, ధ్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగల్లో రంజాన్‌ పండుగ ఒకటని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. ముస్లిం చేసే ప్రార్థనలు, అల్లా దీవెనలతో ప్రజలకు సకల సౌభాగ్యాలు, అన్నివర్గాల ప్రజలు రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ప్రముఖుల శుభాకాంక్షలు..

జిల్లాకేంద్రంలోని ఈద్గా వద్ద డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆర్‌.శివారెడ్డి, మార్కెట్‌ మాజీ చైర్మన్లు అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, బండి వేణుగోపాల్‌, సరాఫ్‌ నాగరాజు, సుధాకర్‌, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

రంజాన్‌ సందర్భంగా ఎస్పీ డా. వినీత్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ఈద్గాలు, మసీదులు, ప్రార్థన మందిరాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ ఎన్‌.లింగయ్య జిల్లాకేంద్రంలోని బువ్వమ్మ గుట్ట ఈద్గా వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు. డీఎస్పీ వెంట సీఐ శివశంకర్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement