నేడు, రేపు సెలవు
నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ఈ నెల 10, 11 తేదీల్లో సెలవు ప్రకటిస్తూ సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఎన్నికలకు నోటిఫై చేసిన ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు పోలింగ్ రోజున సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా స్థానిక సెలవుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు
నారాయణపేట: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డా.వినీత్ హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జలాల్‌పూర్ ఎరగ్రుట్ట చెక్‌పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ విధానాన్ని స్వయంగా పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం, ఇతర అనుమానాస్పద వస్తువుల తరలింపును కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. చెక్‌పోస్ట్ వద్ద సిబ్బంది సంఖ్య పెంచి తనిఖీలను మరింత కఠినంగా చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం సైలెంట్ పీరియడ్ కొనసాగుతున్నందున రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టంచేశారు. సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేలా, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడమే పోలీస్‌శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాజు నరేశ్ ఉన్నారు.
సమస్యలపరిష్కారానికి కృషి
నారాయణపేట రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్‌టీయూ నిర్విరామంగా కృషి చేస్తోందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు యాద్గీర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి.. యూనియన్ బలోపేతానికి కృషిచేసిన విశ్రాంత ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణతో పాటు ఉపాధ్యాయుల హక్కులు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తమ యూనియన్ ఎల్లప్పుడు కృషి చేస్తోందన్నారు. సీపీఎస్ రద్దు అంశంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. పీఆర్పీ, డీఏ బకాయిలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, వెంకటరెడ్డి, రఘువీర్, జనార్దన్, సత్యనారాయణరెడ్డి, భాస్కర్, సూర్యప్రకాశ్, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, సంతోష్, రమేశ్‌శెట్టి పాల్గొన్నారు.
నేడు, రేపు సెలవు


