పోలింగ్‌పై నిశిత పరిశీలన జరపాలి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌పై నిశిత పరిశీలన జరపాలి

Feb 10 2026 7:24 AM | Updated on Feb 10 2026 7:24 AM

పోలింగ్‌పై నిశిత పరిశీలన జరపాలి

పోలింగ్‌పై నిశిత పరిశీలన జరపాలి

నారాయణపేట: మున్సిపల్‌ ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్‌ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకురాలు సీతాలక్ష్మి మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలు పక్కాగా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్‌ ప్రక్రియను అనుసరిస్తూ.. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో బాధ్యతలు కేటాయించనున్నట్లు చెప్పారు. పోలింగ్‌కు సంబంధించిన ప్రతి అంశంపై మైక్రో అబ్జర్వర్లకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా పోలింగ్‌కు ముందు 9 గంటల సమయానికే డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌కు చేరుకొని పోలింగ్‌ సిబ్బందికి అందించే సామగ్రి సక్రమంగా అందిందా? లేదా అనేది పరిశీలించాలని.. అనంతరం పోలింగ్‌ సిబ్బందితో కలిసి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతుందా? లేదా అనేది నిశిత పరిశీలన చేయాలని.. గమనించిన అంశాలను జనరల్‌ అబ్జర్వర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అదే విధంగా ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌, ఇతర అధికారులు నిర్వర్తిసున్న విధులను గమనించాలన్నారు. టెండర్‌, చాలెంజ్‌ ఓటింగ్‌ జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. పోలింగ్‌ ప్రక్రియ తీరు తెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని.. ఎక్కడ పోలింగ్‌ విధుల్లో జోక్యం చేసుకోకూడదని అన్నారు. ఓటింగ్‌ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో మరింత ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పోలింగ్‌ కేంద్రం బయట, పరిసర ప్రాంతాల్లోనూ జరిగే అంశాలను గమనిస్తూ జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘా ఉంచాలని.. ఎన్నికల సంఘం గుర్తింపుకార్డు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారు మినహా.. ఇతరులు ఎవరూ పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీను, మున్సిపల్‌ ప్రత్యేకాధికారులు రాజేందర్‌గౌడ్‌, సుధాకర్‌రెడ్డి, లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement