ఎన్నికల్లో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ కీలకం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ కీలకం

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

ఎన్నికల్లో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ కీలకం

ఎన్నికల్లో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ కీలకం

నారాయణపేట: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ పారదర్శకంగా నిర్వహించేందుకు ర్యాండమైజేషన్‌ ప్రక్రియ అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. పోలింగ్‌ సిబ్బంది కేటాయింపులో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్‌, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల్లో ఏర్పాటుచేసిన అన్ని పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన సిబ్బందిని కేటాయించారు. మొత్తం 72 వార్డుల్లో 149 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. 20 శాతం రిజర్వుతో ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఒక పీఓ, ఒక ఏపీఓ, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 362 మందిని రెండో ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఏర్పాటుచేసిన రోడ్డు సేఫ్టీ సమావేశంలో ఎస్పీ డా.వినీత్‌కుమార్‌తో కలిసి కలెక్టర్‌ మాట్లాడారు. ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే, పోలీసుశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. జిల్లాలో గుర్తించిన బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద ప్రమాదాల నివారణే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద చేపట్టాల్సిన చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. నారాయణపేట, మక్తల్‌, మరికల్‌లో గుర్తించిన బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద మూడేళ్ల కాలంలో 101 రోడ్డు ప్రమాదాలు జరిగి 64 మంది ప్రాణాలు కోల్పోయ్యారని డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. కాగా, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న పాఠశాలల వద్ద బారీకేడ్లు ఏర్పాటుచేసేలా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని డీఈఓ గోవిందరాజులుకు కలెక్టర్‌ సూచించారు. క్షత్రగాత్రులను గోల్డెన్‌ అవర్‌లో ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌ఓ డా.జయచంద్రమోహన్‌ను ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ రియాజ్‌ హుల్‌ హక్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ, ఆర్టీఓ మేఘాగాంధీ, ఆర్టీఓ మెంబర్‌ పోషల్‌ రాజేష్‌, డిపో మేనేజర్‌ లావణ్య తదితరులు ఉన్నారు.

● జిల్లాలో అర్హత లేని వైద్యులు స్కానింగ్‌ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ప్రతి స్కానింగ్‌ సెంటర్‌ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్‌కు సూచించారు. జిల్లాలో తక్కువ జెండర్‌ రేషియో (నిష్పత్తి) ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి (0–6 ఏళ్ల) జెండర్‌ రేషియో పెంచాలని సూచించారు. మూడేళ్ల క్రితం ఎక్కువ ఉన్న రేషియో.. ఈ ఏడాది తక్కువ కావడంపై కారణాలను విశ్లేషించాలన్నారు. రెండోసారి స్కానింగ్‌ తర్వాత మళ్లీ స్కానింగ్‌కు రాని గర్భిణులపై ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. కాగా, 2024–25లో (955/1000), 2025–26లో (927/1000) జెండర్‌ రేషియో నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.శైలజ, డీఎస్పీ లింగయ్య, ఐఎంఏ ప్రెసిడెంట్‌ మల్లికార్జున్‌, సీఐ శివశంకర్‌ ఉన్నారు.

● జిల్లాలో మార్చి నెలాఖరు నాటికి 3,500 ఎకరాల ఆయిల్‌పాం సాగు లక్ష్యాన్ని సాధించాలని.. అందులో భాగంగా ఈ నెలలో 500 ఎకరాల సాగు కావాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగు పురోగతిపై కలెక్టరేట్‌లో ఆమె సమీక్షించారు. లక్ష్య సాధన కోసం జిల్లా ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ అధికారులు, టీజీ ఆయిల్‌ఫెడ్‌ మేనేజర్‌ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో హార్టికల్చర్‌ అధికారి సాయిబాబా, డీఏఓ జాన్‌సుధాకర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement