రాజకీయం రణరంగం | - | Sakshi
Sakshi News home page

రాజకీయం రణరంగం

Feb 4 2026 7:05 AM | Updated on Feb 4 2026 7:05 AM

రాజకీ

రాజకీయం రణరంగం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, నాగర్‌కర్నూల్‌: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు చివరి వరకు ప్రయత్నాలను కొనసాగించారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వార్డులను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ముమ్మరంగా ప్రయత్నించారు. పార్టీలో రెబల్స్‌గా పోటీలో ఉన్న అభ్యర్థులను బుజ్జగించేందుకు ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు పార్టీ బీఫారాల అప్పగింతకు సమయం ఉండగా పలుచోట్ల చివరి క్షణం వరకూ హైడ్రామా కొనసాగింది.

● నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలో 15వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ప్రయత్నించడం, ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. మొదట బీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్‌ వేసిన తవిటి ఇందిర చివరి క్షణంలో కాంగ్రెస్‌ గూటికి చేరడంతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి కాంగ్రెస్‌కు చేరడంతో మిగిలిన ఇండిపెండెంట్‌ అభ్యర్థులను విత్‌డ్రా చేయించేందుకు సైతం కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అభ్యర్థి నజియా బేగం ఇంటికి చేరుకుని అప్పటికే మంతనాలు జరుపుతున్న కాంగ్రెస్‌ నేతలతో వాగ్వివాదానికి దిగారు. పోలీసుల సమక్షంలో ఆమె బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆమెకే బీఫారాన్ని అందించారు.

అసంతృప్త నేతల రాజీనామా పర్వం..

కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు రాజీనామా చేయడం ఆపార్టీలో చర్చనీయాంశంగా మారింది. టికెట్‌ రాని వారిని నామినేషన్‌ ఉపసంహరణ చేసుకోవాలని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బుజ్జగించినా ఫలితం దక్కలేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే మొగ్గుచూపడంతో పాటు పార్టీకి రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతోంది. నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలో 6వ వార్డులో కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ వేసిన తైలి శ్రీనివాసులకు పార్టీ బీఫారం ఇవ్వలేదు. దీంతో భంగపాటుకు గురైన ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ కమ్యునికేషన్‌ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. అలాగే నాగర్‌కర్నూల్‌ జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మల్లేపల్లి జగన్‌ కల్వకుర్తి మున్సిపాలిటీలో 11 వార్డులో నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ పార్టీ బీఫారం ఇవ్వకపోవడతో తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

డబుల్‌ బీఫారాలతో అలజడి..

గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ వేసిన అభ్యర్థులకు ఒకే వార్డుల్లో ఇద్దరికి బీఫారాలు ఇవ్వడం కలకలం రేపింది. మొదట మున్సిపాలిటీలో 37 వార్డు స్థానాలకు గానూ కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి చెందిన వర్గీయులకు 37 మందికి పార్టీ బీఫారాలను అందజేశారు. ఆతర్వాత కాంగ్రెస్‌ నేత సరితాతిరుపతయ్య వర్గానికి చెందిన మరో ఏడుగురు సైతం పార్టీ బీఫారాలను సమర్పించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

స్వతంత్రుల్లో సింహభాగం రెబల్స్‌గా..

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. చాలాచోట్ల బీజేపీ అభ్యర్థుల కన్నా ఇండిపెండెంట్‌ అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థుల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన వారే రెబల్స్‌గా పోటీలో ఉండటంతో ఎన్నికల ఫలితాల్లో ఏం జరుగుతుందోనని ఇరు పార్టీల కేడర్‌ ఆందోళన చెందుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడం, తుది పోరులో మిగిలిన అభ్యర్థులు ఎవరన్నది తేలిపోవడంతో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల వేళ చివరి నిమిషంలో పార్టీల్లోకి చేరికలు

గద్వాల, నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీల్లోచివరి వరకు హైడ్రామా

బలాబలాల ప్రదర్శనపై ప్రధాన పార్టీల దృష్టి

ఉపసంహరణ ఘట్టం ముగియడంతోఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం

రాజకీయం రణరంగం 1
1/1

రాజకీయం రణరంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement