‘అణు’ముప్పు! | - | Sakshi
Sakshi News home page

‘అణు’ముప్పు!

Feb 4 2026 7:05 AM | Updated on Feb 4 2026 7:05 AM

‘అణు’ముప్పు!

‘అణు’ముప్పు!

కృష్ణా: రాష్ట్ర సరిహద్దు సమీపంలో కర్ణాటక ప్రభుత్వం అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు సిద్ధం కావడం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా మండలానికి అతి సమీపంలోని శక్తినగర్‌ పవర్‌ప్లాంట్‌ వద్ద అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుతో కృష్ణాజలాలు కలుషితం కావడంతో పాటు తాగు, సాగునీటి కష్టాలు తలెత్తుతాయని కృష్ణా మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా శక్తినగర్‌ పవర్‌ప్లాంట్‌ వద్ద దాదాపు 1300 ఎకరాల్లో అణువిద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అధికారులు రెండు రోజుల క్రితం స్థల పరిశీలన చేశారు. దీనిపై అక్కడి రెవెన్యూ అధికారులు, న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ అధికారులు సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ ఉండటం.. ఈ అణువిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు అయితే కృష్ణా మండల ప్రజలకు కష్టాలు తప్పవని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

వందల సంఖ్యలో కెమికల్‌ ఫ్యాక్టరీలు..

ఇప్పటికే సరిహద్దు సమీపంలో కర్ణాటక ప్రభుత్వం వందల సంఖ్యలో కెమికల్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత వాతావరణం, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. ఫ్యాక్టరీల నుంచి వెలువడే కెమికల్‌ పొగ మూలంగా పలు గ్రామాల ప్రజలు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కెమికల్‌ ఫ్యాక్టరీల నుంచి వదజల్లే కాలుష్యాన్ని నియంత్రించాలని మండల ప్రజలు కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. ఇప్పుడు కృష్ణానది అటువైపు ఏర్పాటుకానున్న అణువిద్యుత్‌ కేంద్రంతో నదిలోని నీరు కలుషితం కానుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా శక్తినగర్‌, రాయచూర్‌ పట్టణాల్లోని ప్రజలు ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేస్తూ అక్కడి అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఏదేమైనా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసే అణువిద్యుత్‌ కేంద్రంతో మండల ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి నెలకొంది.

కర్ణాటకలోని శక్తినగర్‌ పవర్‌ప్లాంట్‌

సరిహద్దు సమీపంలో అణువిద్యుత్‌కేంద్రం ఏర్పాటుకు కర్ణాటక సన్నద్ధం

కలుషితంకానున్న కృష్ణాజలాలు

పంటలపై తీవ్ర ప్రభావం

ఆందోళన చెందుతున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement