ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి ఉండాలి
నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గి మండలాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, హౌసింగ్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా నిర్దేశిత లక్ష్యం.. సాధించిన లక్ష్యంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యం వందశాతం సాధించాలని ఆదేశించారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో దశల వారీగా నిర్మాణాలు పూర్తిచేయించి.. బిల్లులు అందించి ప్రోత్సహించాలన్నారు. నిర్మాణాల్లో వెనకబడిన గ్రామాల్లో వారం రోజుల్లోగా పురోగతి సాధించేందుకు కృషి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కోస్గి మండలంలోని గ్రామాలకు ఇచ్చిన ఇళ్ల టార్గెట్‌లో వంద శాతం నిర్మాణాలను ప్రారంభింపజేసిన సర్జఖాన్‌పేట, చెన్నారం గ్రామాల కార్యదర్శులను కలెక్టర్ అభినందించారు. కొడంగల్ నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించే అవకాశం ఉందని.. అంతలోగా అధికారులకు ఇచ్చిన లక్ష్యాన్ని 90శాతం సాధించాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లో ఆస్తిపన్ను వసూలు, పారిశుద్ధ్యంపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, డీపీఓ సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
● భూ భారతి సర్వే సమగ్రంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. భూ భారతి సర్వేకు వినియోగించే పరికరాల పనితీరును జిల్లా సర్వే అధికారి ఏడీ వేణుగోపాల్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో మొదటి విడతగా కోస్గి, కొత్తపల్లి నారాయణపేట, షేర్‌పల్లి, నర్వ జంగంరెడ్డిపల్లిలో గ్రామసభలు నిర్వహించి.. సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు.


