బీఫాం ఎవరికో..?
మక్తల్, కోస్గి, మద్దూర్ బల్దియాల్లో తేలని టికెట్ల ‘పంచాయితీ’
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల నుంచి ఒకరికి మించి అభ్యర్థులు నామినేషన్లు వేయడం.. వాటి పరిశీలన సైతం పూర్తికావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెబల్స్ పోటీలో ఉంటే వైఫల్యం తప్పదని భయపడుతున్న ఆయా పార్టీల అభ్యర్థులు.. తమకు పోటీగా ఉన్న వారిని బుజ్జగిస్తూ, రాయబారాలతో నామినేషన్ ఉపసంహరణ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
మూడు మున్సిపాలిటీల్లో ఉత్కంఠ..
జిల్లాలోని మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో ఇంకా ఎవరికీ పార్టీ బీఫాంలు ఇవ్వలేదు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి ప్రతి వార్డుకు ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీలో నిలవడంతో బీఫాం ఎవరికి దక్కుతుందో తెలియ ని పరిస్థితి నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం వరకు ఉండటంతో ఆయా పార్టీల నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. చివర కు పార్టీ నుంచి బరిలో ఉండేదెవరో.. రెబల్‌గా మిగిలేదెవరోనని పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. పార్టీ బలోపేతానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడితే, పైసలు ఉన్న వారికి టికెట్ ఇస్తారా అంటూ కొందరు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మరికొందరు ప్రధాన పార్టీల ముఖ్యనేతల వద్ద బీఫాం కోసం క్యూ కడుతుండటంతో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు బీఫారాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించనున్నారు.
దాటవేత ధోరణిలో అధినేతలు..
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి బీ ఫారాలు ఇవ్వకుండా వెయిట్ అండ్ సీ అంటూ అధినేతలు దాటవేస్తున్నారని పోటీదారులు వాపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి ఇద్దరి కంటే ఎక్కువగా నామినేషన్లు వేసిన వారిలో ఒకరికి బీ ఫామ్ ఇస్తే.. మిగిలినవారు పార్టీ జంపయ్యే అవకాశం లేకపోలేదని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ వార్డుల పరిధిలో గెలుపోటములపై సర్వే నిర్వహిస్తున్నామని చెబుతూ బీ ఫారాలు ఇవ్వకుండా దాటవేస్తున్నట్లు తెలిసింది. నామినేషన్లు వేసినప్పుడే బీఫారాలు ఇచ్చి ఉంటే అభ్యర్థులు ప్రతి ఓటరును కలిసే అవకాశం ఉండేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రధాన పార్టీల నుంచి
పోటాపోటీగా నామినేషన్లు
నేటితో ముగియనున్న
ఉపసంహరణ గడువు
పోటీదారుల్లో బీఫాం టెన్షన్
బీఫాం ఎవరికో..?


