పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ డా.వినీత్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులు, దర్యాప్తులో పురోగతి, నేరాల నియంత్రణ అంశాలపై సమీక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి, నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. జనసామర్థ్యంగల ప్రదేశాల్లో విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో గంజాయి రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ చోరీ కేసులను ఆధునిక సాంకేతికతతో ఛేదించి.. చోరీ సొత్తు బాధితులకు అందించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్స్‌ను వెంటనే అమలు చేయాలన్నారు. రౌడీ షీటర్స్, పాత నేరస్తులు, అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలకు ఆస్కారం లేకుండా ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేసి.. వెపన్స్ డిపాజిట్ ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉంటూ నిరంతరం తనిఖీలు నిర్వహించి నగదు, మద్యం, ఇతర ప్రలోభకర వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని పోలీస్ విభాగాలు సమన్వయంతో పనిచేసి.. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎండీ రియాజ్ హూల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, రాంలాల్, సైదులు, భగవత్‌రెడ్డి, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, నరేశ్, సునీత, రాజు, రాముడు, బాలరాజు, రాజశేఖర్, రాములు, భాగ్యలక్ష్మీరెడ్డి, నవీద్, అశోక్‌బాబు, పురుషోత్తం, గాయత్రి, మహేశ్వరి ఉన్నారు.


