ఈసారీ.. నిరాశే
నారాయణపేట
కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు దక్కని కేటాయింపులు
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాక్షి, నాగర్‌కర్నూల్: కేంద్ర బడ్జెట్ ఈసారి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లావాసులకు నిరాశే మిగిల్చింది. ఉమ్మడి జిల్లాకు జీవనాడిగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో బడ్జెట్‌లో ప్రస్తావన కరువైంది. సాగునీటి ప్రాజెక్టులు, పర్యాటక రంగ అభివృద్ధితో పాటు గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌కు ఎలాంటి కేటాయింపులు దక్కలేదు. కొత్తగా అలంపూర్– నల్లగొండ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని భావించినా భంగపాటు ఎదురైంది. వెనుకబడిన జిల్లాలో ఉపాధి కల్పనకు ప్రత్యేకంగా పరిశ్రమల ఏర్పాటు ఉంటుందని ఆశించగా అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే హైదరాబాద్– బెంగళూరు రైల్వే మార్గంలో హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు, ప్రతి జిల్లాలో బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు, చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహంతో ఉమ్మడి జిల్లాకు కాసింత ప్రయోజనం కలగనుంది.
ఊసే లేని గద్వాల– మాచర్ల కొత్త లైన్
ఉమ్మడి పాలమూరులో చేపట్టాల్సిన కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావన కరువైంది. గద్వాల– మాచర్ల రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని భావించగా నిరాశే మిగిలింది. కృష్ణా– వికారాబాద్– గద్వాల– డోర్నకల్ రైల్వే లైన్ల ప్రతిపాదనలు అలాగే మిగిలిపోయాయి. ఉమ్మడి జిల్లా అలంపూర్ సమీపంలోని పుల్లూరు నుంచి నల్లగొండ వరకు నూతన జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సర్వే సైతం నిర్వహించగా.. ఈసారి బడ్జెట్‌లో మాత్రం నిధులు కేటాయించలేదు.
చేనేత కార్మికులకు దన్ను..
మహాత్మగాంధీ గ్రామ్ స్వరాజ్, సమర్థ్ 2.0 కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను కేంద్రం అందించనుంది. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఉన్న మరమగ్గాలు, చేనేత కార్మికులకు ఈ పథకం ద్వారా మేలు చేకూరనుంది. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా బ్రాండింగ్‌తోపాటు మార్కెట్ లింకేజీ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచనున్నారు.
చదువు.. ఉపాధి
విద్యాభివృద్ధిలో భాగంగా బాలికల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేయనున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో బాలికల భాగస్వామ్యం పెంచడంతోపాటు విద్యాభివృద్ధి కోసం ఈ హాస్టళ్లను ఏర్పాటు చేస్తారు. దీనిద్వారా బాలికలకు చదువుతోపాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను కల్పించనున్నారు.
● యువతకు చదువుతో పాటు నేరుగా ఉపాధి కల్పించే విధంగా నైపుణ్యాలను పెంచేందుకు ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్‌మెంట్ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, కంటెంట్ క్రియేషన్ ల్యాబ్‌లను ఏర్పాటుచేసి యువతకు శిక్షణ ఇవ్వనున్నారు.
సామాన్యులకు వ్యతిరేకం..
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. రాష్ట్రంతోపాటు వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేవు. విభజన సమయంలో హామీ ఇచ్చిన విధంగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో ప్రస్తావన కూడా లేదు. ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులు పెంచలేదు. నిరుద్యోగులు, నిత్యావసర ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు కనిపించలేదు.
– మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్
రాష్ట్రంపై నిర్లక్ష్యం..
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రా న్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదు. పర్యాటకరంగ అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోలేదు. పేదలు, మధ్యతరగతి వర్గాలపై దృష్టిపెట్టలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు రైల్వేతోపాటు జాతీయ రహదారుల ప్రస్తావన లేదు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
– జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి
హైస్పీడ్ రైల్వే కారిడార్..
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రైల్వే మార్గాన్ని హైస్పీడ్ రైల్వే కారిడార్‌గా మార్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లు వేగాన్ని పుంజుకోనున్నాయి. పర్యావరణహితమైన రవాణా వ్యవస్థగా మార్చడంతోపాటు ప్రయాణ సమయాన్ని తగ్గించేలా రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. తద్వారా వేగంగా చేరుకోవడంతో పాటు ఇతర రైల్వే నెట్‌వర్క్, రోడ్లపై రద్దీ భారం తగ్గనుంది. ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ ద్వారా ఉమ్మడి జిల్లాలో రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
దక్కని జాతీయ హోదా..
ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ప్రకటనతో పాటు పనులను వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి నిధులు అందించాలన్న డిమాండ్ ఏళ్లుగా వ్యక్తమవుతోంది. అయితే కేంద్ర బడ్జెట్‌లో దీనిపై కనీస ప్రస్తావనకు నోచుకోలేకపోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు సర్దుబాటు చేసే భారమంతా రాష్ట్రం మీదే పడింది. అలాగే ఉమ్మడి జిల్లాలో ఐదోశక్తి పీఠమైన అ లంపూర్ జోగుళాంబ ఆలయానికి ప్రసాద్ పథకం కింద ప్రత్యేకంగా నిధులు అందుతాయని భావించినప్పటికీ నిరాశే మిగిలింది. కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరుపై ఆశలు పెట్టుకోగా భంగపాటు తప్పలేదు.
పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తావన కరువు
గద్వాల– డోర్నకల్ రైల్వే లైన్లు, నూతన జాతీయ రహదారులకు తప్పని భంగపాటు
హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైల్వే కారిడార్‌తో ప్రయోజనం
ప్రతి జిల్లాలోనూ బాలికలకు ప్రత్యేకంగా
హాస్టల్ ఏర్పాటుతో మేలు
ఈసారీ.. నిరాశే
ఈసారీ.. నిరాశే


