ప్రచార హోరు..!
● అభివృద్ధి మంత్రంతో అధికార పార్టీ
● కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీజేపీ
● ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్
నారాయణపేట: జిల్లాలోని నాలుగు పురపాలికలు.. 72 వార్డుల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం రంగంలోకి దిగారు. నారాయణపేటలో కాంగ్రెస్‌పార్టీ అందరికంటే ముందుగానే చైర్‌పర్సన్ అభ్యర్థిగా పుర మాజీ వైస్ చైర్మన్ సతీమణి సరిత హరినారాయణభట్టడ్ పేరుకు ప్రకటించి ముందడుగు వేసింది. బీజేపీ అభ్యర్థులను ఎంపీ డీకే అరుణ ప్రకటించి సన్మానించారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రకటించి అందరి కంటే ముందే బీఫారాలు పాత చిన్నపిల్లల ఆస్పత్రి వద్ద అందజేశారు. మిగతా ఏ పురపాలికలోనూ ఏ పార్టీ చైర్మన్ అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆశావహులకు టికెట్ దక్కకపోతే ఇతర పార్టీల్లోకి జంప్ చేయాలా.. తమ సత్తా ఏమిటో చాటేందుకు రెబల్‌గా దిగుదామా అంటూ అనుయాయులతో సమాలోచనలు జరుపుతున్నారు.
● అధికార కాంగ్రెస్‌పార్టీ పురపాలికలపై జెండా ఎగరవేసేందుకు అశావహుల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి నామినేషన్ వేయించారు. మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్న మక్తల్‌లో దాదాపు రూ.25 కోట్లు, నారాయణపేట మున్సిపల్ కేంద్రంలో రూ.19 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. నారాయణపేటలో జెండా ఎగరవేస్తే క్రీడా మైదానానికి రూ.30 కోట్లు, ప్రతి వార్డుకు రూ.కోటి చొప్పున అభివృద్ధి నిధు లు మంజూరు చేస్తామ ని హామీ ఇచ్చారు. సీఎం ఇలాఖాలోని మద్దూర్ మున్సిపాలిటీలో దాదాపు రూ.50 కోట్లు, కోస్గి మున్సిపాలిటీలో రూ.300 కోట్ల పనులు ఇప్పటికే ప్రారంభించారు. అధికారపార్టీ నాలుగు పురపాలికలను హస్తగతం చేస్తే రూ.వందల కోట్లు తీసుకొచ్చి ప్రగతిని పరుగులు పెట్టిస్తామంటూ భరోసానిస్తున్నారు.
కేంద్ర పథకాలతో..
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సైతం పుర ఎన్నికలను సవాల్‌గా తీసుకుంది. కోస్గి, మద్దూర్, నారాయణపేట, మక్తల్‌లో అమృత్ 2.0 కింద తాగునీటి సరఫరాకు రూ.కోట్లు ఇచ్చింది కేంద్రమేనంటూ చెప్పుకొస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌పార్టీ చేసిన పలు అభివృద్ధి శంకుస్థాపనలు ఎన్నికల స్టంట్ అంటూ దుయ్యబట్టారు. ప్రతి వార్డులో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో కోర్ కమిటీలు ఏర్పాటుచేసి అభ్యర్థులను ప్రకటించే బాధ్యతను వారికే అప్పగించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి.. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. సీఎం ఇలాఖాలోని కోస్గి, మద్దూర్‌లో కారు జోరుతో హస్తాన్ని అడ్డుకునేందుకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి వ్యూహరచన అమలు చేస్తున్నారు. నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపి ఎవరి ఊహకు అందకుండా మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి పావులు కదిపారు. మక్తల్ మున్సిపాలిటీ మంత్రి ఇలాఖా కావడంతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తన రాజకీయ అనుభవంతో 16 వార్డుల్లో అభ్యర్థులను నిలిపారు.


