తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి
పాలమూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బుధవారం పాలమూరుకు వస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జాతీయ అధ్యక్షుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మధ్యాహ్నం ఒకటి గంటలకు బయలుదేరి నేరుగా ఎంవీఎస్ కళాశాల మైదానానికి చేరుకుంటారని ఎంపీ డీకే అరుణ అన్నారు. తొలిసారి జిల్లాకు వస్తున్న క్రమంలో భారీగా స్వాగతం పలకాలని అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఇన్‌చార్జి చింతల రామచంద్రారెడ్డితో కలిసి మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం కార్యకర్తలకు జాతీయ అధ్యక్షుడు దిశానిర్దేశం చేస్తారన్నారు. గ్రామాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావాలని, బూత్‌స్థాయి కార్యకర్తల నుంచి జిల్లాస్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలన్నారు.
● మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో పోటీ చేసే అవకాశం వచ్చిన ప్రతి అభ్యర్థి దీనిని సద్వినియోగం చేసుకొని విజయం సాధించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం రాత్రి కార్పొరేషన్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. గెలుపు అవకాశాలు అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని అభ్యర్థిని పార్టీ ఎంపిక చేసిందని, డివిజన్‌లో అందరిని కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రమేష్, పద్మజారెడ్డి, బాలరాజు, కృష్ణవర్ధన్‌రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


