రోడ్డు భద్రత నియమాలతో ప్రాణాలు సురక్షితం
నారాయణపేట: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించినప్పుడే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని జిల్లా రవాణాశాఖ అధికారి మేఘాగాంధీ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీటీఓ మాట్లాడుతూ.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, ఇతర వాహనాల డ్రైవర్లు సీటు బెల్టు ధరించాలని సూచించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం, అతివేగం, డ్రంకెన్ డ్రైవ్‌తో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంవీఐ భోదిశ్రీ, ఏఎంవీఐ దీప్తి, సాయితేజరెడ్డి, ఆర్టీఏ మెంబర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


