బాలికల సంరక్షణ అందరి బాధ్యత
నారాయణపేట రూరల్: రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా బాలికలదేనని.. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కోర్టు జూనియర్ సివిల్‌జడ్జి బి.సాయిమనోజ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ బాలికా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బేటీ బచావో.. బేటీ పడావో వంటి ప్రభుత్వ పథకాలు బాలికల రక్షణ, విద్యకు ఎంతగానో తోడ్పడుతున్నాయన్నారు. బాలికల ఉజ్వల భవిష్యత్‌కు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు సహకరించాల్సిన అవసరముందన్నారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, సాధికారత అందించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉండేలా చేయవచ్చని అన్నారు. అనంతరం బాలల సంరక్షణ చట్టాలు, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్‌పై అవగాహన కల్పించారు. టోల్‌ఫ్రీ 15100 నంబర్ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె.లక్ష్మీపతిగౌడ్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నందు నామాజీ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కరిష్మ, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ నర్సింహ పాల్గొన్నారు.


