‘పేట’ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం
● పదవులు శాశ్వతం కాదు.. ప్రజాసేవకే ప్రాధాన్యం
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట: పురపాలికతో పాటు నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల అభివృద్ధి తన బాధ్యతని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం సాయంత్రం పురపాలికలోని 24 వార్డుల్లో రూ.16.40 కోట్ల అభివృద్ధి పనులకు కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుంభం శివకుమార్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సెంటర్‌చౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవితంలో పదవులు శాశ్వతం కాదని.. ప్రజల కోసం చేసే మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. పేటను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని, మైదానం అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేస్తానని చెప్పారు. తనకున్న మిగతా శాఖల నుంచి కూడా రూ.5 కోట్లు కేటాయిస్తానని, ప్రతి వార్డుకు రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే పుర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని కోరారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టు పూర్తితో జిల్లాకు బిహార్ కూలీలు వలస వచ్చి ఇక్కడి పొలాల్లో నాట్లు వేస్తారన్నారు. 60 ఏళ్ల కల అయిన కృష్ణా–వికారాబాద్ రైల్వేలైన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రంతో మాట్లాడి మంజూరు చేసుకొచ్చారని, ఇటీవలే క్యాబినెట్‌లో చర్చించి రూ.423 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. దేశ చరిత్రలో ముందుగానే 96 శాతం రైతులను ఒప్పించి వారి భూములకు పదింతల నష్టపరిహారం ఇచ్చిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. సీఎం, మంత్రుల ఇంట్లో తినే సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం మనదేనని చెప్పారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సరిత హరినారాయణభట్టడ్‌ను చైర్‌పర్సన్‌ను చేసి ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. రూ.వంద కోట్లు తీసుకొచ్చి పురపాలికను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సామాజిక సేవకుడిగా పార్టీ కండువా తీసి ఓటు అడిగేందుకు మీ ముందుకు వస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొనంగేరి హన్మంతు, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సుధాకర్, బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యకుడు సలీం, పార్టీ పట్టణ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ
రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చేనేత రుణమాఫీ వర్తింపజేయడంతో అందుకు సంబంధించిన చెక్కులను శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుంభం శివకుమార్‌రెడ్డి చేనేత కార్మికులకు అందజేశారు. 8 బ్రాంచ్‌లలో 106 మంది కార్మికులకు సంబంధించి రూ.65,93,854 మంజూరయ్యాయి. చెక్కులు అందుకున్న చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. చేనేత, జౌళిశాఖ అధికారులు విజయ్‌కుమార్, బాబు, లావణ్య తదితరులు పాల్గొన్నారు.


