ఎన్నికల నిర్వహణలో ఆర్‌ఓల పాత్ర కీలకం
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: పురపాలికల ఎన్నికల నిర్వహణలో ఆర్‌ఓల పాత్ర కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నారాయణపేట, మద్దూరు పురపాలికలకు సంబంధించిన ఆర్‌ఓ, ఏఆర్‌ఓల శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉందని.. నిర్వహణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. శిక్షణలో చెప్పిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. నామినేషన్ల స్వీకరణ మొదలు స్క్రూటినీ, నామపత్రాల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల సంఘం నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పని చేశాం.. అన్ని తెలుసనే ధీమాలో ఉండకుండా మాస్టర్ ట్రైనర్లు చెప్పినవన్నీ శ్రద్ధగా వినాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇచ్చిన హ్యాండ్‌బుక్‌ను పూర్తిగా చదవాలని, అప్పుడే అన్ని విషయాలపై అవగాహన వస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్, డీపీఓ సుధాకర్‌రెడ్డి, పుర కమిషనర్ నర్సయ్య పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఓటరు ప్రతిజ్ఞ..
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్, ఏఓ శ్రీధర్ పాల్గొని జిల్లా అధికారులు, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.


