బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాలి
నారాయణపేట టౌన్: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని.. బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వింద్యానాయక్ అన్నారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో చేపట్టిన బాల్యవివాహ రహిత భారత్ 100 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా సోమవా రం జిల్లా కోర్టు ఆవరణలో లీగల్ వలంటీర్స్, అంగన్‌వాడీ టీచర్లు, అశావర్కర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణకు అందరూ పాటుపడాలన్నారు. బాల్యవివాహాలతో కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్యవివాహాలను అరికట్టడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్‌జడ్జి మనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి అవినాష్, లక్ష్మీపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


