స్వేచ్ఛగా ఓటు హక్కువినియోగించుకోవాలి
ఊట్కూరు: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. మద్యం, డబ్బులకు ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని డీఎస్పీ లింగయ్య సూచించారు. సోమవారం ఊట్కూరు మండల కేంద్రంలో సాయుధ బలగాలతో కలిసి స్థానిక పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుశాఖ లక్ష్యమన్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టించినా.. ఇతరులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ రాంలాల్, ఎస్‌ఐ రమేశ్ పాల్గొన్నారు.
18న టీ–20 క్రికెట్ జట్టు ఎంపిక
నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ నెల 18న జిల్లా టీ–20 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ ఇన్‌చార్జి పీడీ రమణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎండీసీఏ, విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహించే జి.వెంకటస్వామి మెమోరియల్ టీ–20 క్రికెట్ లీగ్‌కు జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు, రెండు ఫొటోలతో మినీ స్టేడియానికి రావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 91007 53683 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
నేడు ఎస్‌జీఎఫ్‌బ్యాడ్మింటన్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో నేడు (మంగళవారం) స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ ఒరిజినల్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఉదయం 9 గంటలకు పీడీ సాదత్‌ఖాన్‌కు రిపోర్టు చేయాలని, మిగతా వివరాల కోసం 89198 71829 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.
ఆర్‌ఎన్‌ఆర్ @ రూ.2,822
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,822, కనిష్టంగా రూ.1,639 ధరలు లభించాయి. హంస గరిష్టంగా రూ.1,781, కనిష్టంగా రూ.1,736, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,029, కనిష్టంగా రూ.1,820, కందులు రూ.6,341, వేరుశనగ రూ.7,411, జొన్నలు రూ.1,810 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,669, కనిష్టంగా రూ.2,401గా ధరలు లభించాయి.
ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాల్లో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ధనుర్మాసం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 2026 జనవరి 14 న ముగుస్తుందని, దీంతో ధనుర్మాసంలో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తునట్లు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రాతః కాల మహా మంగళ హారతి ఉదయం 6.30 గంటలకు ఉందని.. ఆ సమయాన్ని 5.30 గంటలకు మార్పు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలోనూ ప్రాతఃకాల మహా మంగళహారతిని ఉదయం 6 గంటల నుంచి 5.45గా మార్పు చేసినట్లు తెలిపారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
స్వేచ్ఛగా ఓటు హక్కువినియోగించుకోవాలి


