మంత్రికి సవాల్‌గా సం‘గ్రామం’
● పల్లెల్లో పట్టుకు ప్రధాన పార్టీల ప్రయత్నాలు
● గ్రామాల్లో జోరుగా సాగిన
ఎన్నికల ప్రచారం
నారాయణపేట: జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో మూడో విడత జరిగే పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సవాల్‌గా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 67 స్థానాలకు గాను 50 స్థానాల వరకు విజయం సాధించారు. మలి విడత నారాయణపేట నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి నేతృత్వంలో 52 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో 110 సర్పంచ్ స్థానాలకు గాను 10 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నెల 17న 100 స్థానాలకు జరిగే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకోవడం మంత్రికి సవాల్‌గా మారిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల మక్తల్‌లో జరిగిన సీఎం సభకు జనం రాకపోవడంతో అసంతృప్తికి గురైన మంత్రి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతారని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పోటాపోటీగా వ్యూహాలు..
జిల్లాలోని మక్తల్, ఊట్కూర్, నర్వ, మాగనూర్, కృష్ణా మండలాల్లో అభ్యర్థులు ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు. తొలి, మలి విడత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా నిలిచింది. మూడో విడతలోనూ మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసేందుకు.. పల్లెలో పట్టు సాధించేందుకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలు, నాయకులతో వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ఎంపీ డీకే అరుణ సైతం బీజేపీ మద్దతుదారుల తరఫున ముమ్మర ప్రచారం చేశారు. పంచాయతీల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకెళ్తున్నాయి. సోమవారం ఉదయం 7నుంచి సాయత్రం 5 గంటల వరకు అభ్యర్థుల తరఫున ముఖ్య నేతలు తమ ప్రచారంతో హోరెత్తించారు. చిన్న పంచాయతీలో పోటీపడే వారు సైతం ప్రచార రథాలతో వాడవాడలా ప్రచారం చేయడం గమనార్హం.


