ఇన్‌చార్జి విద్యుత్ ఏఈ
జడ్చర్లలో సోదాలు
ఏసీబీ వలలో
● ఇంటి మీటరు బిగించడానికి
రూ.20 వేల లంచం డిమాండ్
● రూ.15 వేలు తీసుకుంటూ చిక్కిన వైనం
వెల్దండ: ఇంటికి విద్యుత్ మీటరు బిగించడానికి లంచం తీసుకుంటూ విద్యుత్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మహబూబ్‌నగర్ ఇన్‌చార్జి డీఎస్పీ జగదీష్‌చందర్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం రూ.60 వేలు డీడీ చెల్లించారు. కాంట్రాక్టర్లు ట్రాన్స్‌ఫార్మర్ బిగించగా.. అక్కడ నిర్మించిన ఓ ఇంటికి విద్యుత్ మీటర్ బిగించాలని బాధితుడు ఇన్‌చార్జి ఏఈ వెంకటేశ్వర్లుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మీటర్ బిగించడానికి ఏఈ రూ.20 వేలు లంచం డిమాండ్ చేయడంతో రూ.15 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 5న బాధితుడు ఆన్‌లైన్‌లో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు మంగళవారం వ్యవసాయ పొలంలోని ఇంటి వద్ద బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా విద్యుత్ ఏఈను పట్టుకున్నట్లు అధికారులు వివరించారు. అనంతరం ఏఈని వెల్దండ విద్యుత్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ జరిపారు. ఇదే సమయంలో జడ్చర్లలోని విద్యుత్ ఏఈ ఇంట్లో మరో బృందం తనిఖీలు చేపట్టింది. విద్యుత్ ఏఈని బుధవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరస్తామని వివరించారు. దాడుల్లో మహబూబ్‌నగర్ ఏసీబీ సీఐ లింగస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
జడ్చర్ల: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న ఏఈ వెంకటేశ్వర్లు అద్దె ఇంటిలో సైతం ఏసీబీ అధికారుల బృందం మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా పలు ఫైళ్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.


