మొదటి విడత ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
నారాయణపేట: జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జరగనున్న మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సిక్తాపట్నాయక్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి వీసీలో ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి మొదటి దశ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.. అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. ఈమేరకు జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్, సాధారణ పరిశీలకులు వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ చేసినట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించేలా సూచించామన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోనేలా పోలీసు శాఖ సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఎస్‌డిసీ రాజేందర్‌గౌడ్, డీఎస్పీ లింగయ్య, డీఆర్‌డీఓ మొగు లప్ప, డి పిఓ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీడియా సెంటర్ పరిశీలన
కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, కంట్రోల్‌రూం పనితీరును కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అధికారులకు అందించాలని ఆదేశిస్తూ.. కంట్రోల్ రూమ్ కి వచ్చిన రెండు ఫిర్యాదులపై ఆరా తీశారు.
ఎన్నికల నేపథ్యంలో మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలకీ్‌ష్మ్ సమక్షంలో మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ చాంబర్‌లో ర్యాండమైజేషన్ కొనసాగింది. జిల్లాలోని ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఏకగ్రీవమైన వార్డులు, గ్రామ పంచాయతీలను మినహాయించి జిల్లాలోని 53 గ్రామ పంచాయతీల సర్పంచ్, 361వార్డుల స్థానాలకు, 480 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకొని ప్రిసైడింగ్ అధికారులతో పాటు, ఓ.పీ.ఓల ర్యాండమైజేషన్ జరిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీపీఓ సుధాకర్ రెడ్డి, డీపీఆర్‌ఓ రషీద్ పాల్గొన్నారు.


