ప్రలోభాల పర్వం
మద్యం ప్రవాహం..
ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం
సాక్షి, నాగర్‌కర్నూల్: పంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలి విడత ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో గురువారమే తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల్లో పెద్దఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. యథేచ్ఛగా మద్యంతోపాటు డబ్బు పంపిణీతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
చిన్న గ్రామాల్లోనూ భారీగానే..
తొలి విడత ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు దిగుతున్నారు. వెయ్యిలోపు ఓటర్లు ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. గ్రామాల్లోని వార్డుల వారీగా లెక్కలు వేసి కేటాయింపులు చేస్తున్నారు. ఒక్కో వార్డుకు రూ.లక్ష, ఒక్కో కుల సంఘానికి రూ.2 లక్షల వరకు ముట్టజెప్పుతున్నారు. కుల సంఘాల పెద్దల వద్ద రూ.2–3 లక్షల వరకు ఉంచుతూ గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లలో అధిక సంఖ్యలో ఉన్న మహిళలపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. మహిళా సంఘాల సమస్యలపై హామీలు గుప్పిస్తున్నారు. పెద్దసంఖ్యలో మహిళల ఓట్లు పొందేందుకు మహిళా సంఘాలకు రూ.లక్షల్లో ముట్టజెప్పుతూ ప్రలోభాలను సాగిస్తున్నారు.
‘నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేవలం 1,200 లోపు ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఒక్కో అభ్యర్థి కనీసం రూ.15 లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్ రోజునే ఒకరు రూ.3 లక్షల వరకు ఖర్చు చేయగా.. నిత్యం ప్రచారంలో భాగంగా ఇప్పటికే రూ.8 లక్షలు దాటింది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం కూడా ముగియడంతో అభ్యర్థులు నేరుగా మద్యం, డబ్బులతో ప్రలోభాలకు దిగుతున్నారు.’
‘నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీలో ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఇక్కడ సర్పంచ్ స్థానం కోసం అభ్యర్థులు రూ.30 లక్షల దాక ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటుకో మందు సీసాతో పాటు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల దాక ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.’
గ్రామాల్లో జోరుగా మద్యం, డబ్బుల పంపిణీ
ఒక్కో వార్డుకు రూ.లక్ష, కుల
సంఘాలకు రూ.2 లక్షలు
చిన్న పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు
రేపే ఉమ్మడి జిల్లాలోని 550 గ్రామాల్లో తొలి విడత ఎన్నికలు
పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఓటర్లకు మద్యం పంపిణీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాలు మూసివేయగా.. అంతకు ముందే అభ్యర్థులు భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేసి నిల్వ చేశారు. ఓటరుకో క్వార్టర్ చొప్పున పంపిణీ చేస్తుండగా.. కొన్నిచోట్ల మద్యంతోపాటు డబ్బుల పంపిణీ సైతం కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో పోటీని బట్టి ఓటరుకు క్వార్టర్‌తోపాటు రూ.వెయ్యి వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రలోభాల పర్వం


