పెట్టుబడులు.. ఆరు గ్యారంటీలుగా కావొద్దు
నారాయణపేట: క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో కోట్ల ధనంతో గ్లోబల్ ప్రచార ఆర్భాటం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ ఆర్భాటపు ప్రకటనలు ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీల మాదిరిగా కావొద్దని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష నవంబర్ 29న 2009న ప్రారంభమై, దీక్ష విరమణ డిసెంబర్ 9వ తేదితో ముగియడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలో విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టబడులు రావడం అభినందనీయమైనా.. అవి కేవలం ప్రకటనలకు, ఒప్పందాలకే పరిమితమా లేక ఆచరణలో సాధ్యం చేసి చూపిస్తారనేది వారిపై నమ్మశక్యంగా కనిపించడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత రెండేళ్లుగా రాష్ట్రానికి తీసుకువచ్చిన పెట్టుబడులపై ముందుగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 11 రోజుల పాటు సాగిన కేసీఆర్ దీక్ష సకల తెలంగాణను ఏకం చేసిందన్నారు. ఈ దీక్ష సబ్బండ వర్గాల్లో పోరాట స్ఫూర్తి నింపిందన్నారు. తెలంగాణను కష్టపడి పది సంవత్సరాల పాటు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపింది మన కేసీఆర్ మన పార్టీ ప్రభుత్వమన్నారు. ఇలాంటి తెలంగాణను రెండు సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, అవినీతి, అరాచకత్వం అన్న తీరుగా కాంగ్రెస్ పరిపాలన చేస్తోందన్నారు. అసలు ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం సాధించింది అని సంబరాలు చేసుకుంటుందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్నారు. మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్లు కన్నాజగదీశ్, చెన్నారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు సుదర్శన్‌రెడ్డి, విజయ్‌సాగర్, ప్రతాప్‌రెడ్డి, స్టాంరాంరెడ్డి, బుల్లెట్‌రాజు, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేట – కొడంగల్ ప్రాజెక్టులో అవినీతిపరులు
నారాయణపేట – మక్తల్ – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో చేపడుతున్న భూ సేకరణలో అధికార యంత్రాంగం.. అధికార పార్టీ మంత్రాంగంతో నకిలీ పట్టా పాసుపస్తకాలను సృష్టించి అక్రమంగా రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారాయణపేట మండలంలో పేరపళ్ల జాయమ్మ చెరువు కింద వాస్తవంగా కోల్పోతున్న భూములు ఎన్ని, దొంగ పట్టా పాసుపుస్తకాలను సృష్టించి భూ పరిహారాన్ని ఎకరానికి రూ. 20 లక్షల చొప్పున కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కానుకుర్తి రిజర్వాయర్‌లో సైతం ఇదే పద్ధతిలో రూ.కోట్ల స్వాహా చేసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. నకిలీ పట్టా పాసుపుస్తకాల సృష్టిలో ఎవరెవరు ఉన్నారనేది విజిలెన్స్ అధికారులు తేలుస్తారని.. లోకాయుక్తలో భూ పరిహారంపై కేసు వేస్తే అసలు దొంగలు బయటపడతారన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీలు అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, నర్సప్ప నాయకులు విజయ్‌సాగర్, సుదర్శన్‌రెడ్డి, చెన్నారెడ్డి, బాపన్‌పల్లి తిప్పణ్ణ తదితరులు ఉన్నారు.


