అంతా అయోమయం!
అధికార పార్టీ తరఫున ఇద్దరు, ముగ్గురి పోటీ
చిన్నజట్రంలో
ఏకంగా నలుగురు..
మొహం చాటేస్తున్న నాయకులు..
● తాము కాంగ్రెస్ అంటే తాము
కాంగ్రెస్ అంటూ ప్రచారం
● అంతర్మథనంలో పార్టీ పెద్దలు
● ప్రచారం కోసం
ఎవరి వెంట తిరగని వైనం
నారాయణపేట: పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ అంటూ టికెట్ల కేటాయింపు నుంచి విత్‌డ్రా వరకు చోటుచేసుకుంటున్న పరిణామాలతో మండల పార్టీ నాయకులతో పాటు నియోజకవర్గ నేతలు తలపట్టుకుంటున్నారు. తమకే పార్టీ మద్దతు ఇవ్వాలంటూ మంకుపట్టు పట్టిన ఆశావహులు.. తామంటే తాము కాంగ్రెస్ పార్టీ అంటూ రంగంలోకి దిగారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద, ధన్వాడ, మరికల్, నారాయణపేట మండలాల్లో రెండో విడత గ్రామ సంగ్రామం ఆదివారం నుంచి మొదలైంది. తాము అధికార పార్టీకి చెందిన వారిమేనంటూ ఎవరి దారిలో వారు ప్రచారాన్ని జోరుగా చేపట్టారు. పార్టీ అధిష్టానం అండదండలతో కొంతమంది రంగంలోకి దిగితే.. మరికొంత మంది తమ సత్తా ఏంటో గెలిచి చూపిస్తామంటూ అధికార పార్టీ పెద్దలకు సవాల్ విసిరి పోరులోకి దిగారు.
మండలాల్లో ఇదీ పరిస్థితి..
దామరగిద్ద మండల కేంద్రంలో అధికార పార్టీ నుంచి కన్కిరెడ్డి, రేబల్‌గా కౌడ్లి శరణప్ప పోటీపడుతున్నారు. కానుకుర్తిలో ఉద్యోగానికి రాజీనామా చేసిన నారాయణ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్‌గా పోటీ చేస్తుండగా.. అదే పార్టీకి చెందిన సుదర్శన్‌రెడ్డి, భీంరెడ్డి రెబల్స్‌గా రంగంలోకి దిగారు. గట్టిరెడ్డిపల్లిలో సైతం కాంగ్రెస్ మద్దతుదారులు ఇద్దరు పోటీపడుతున్నారు. క్యాతన్‌పల్లిలో కొత్త కాంగ్రెస్ అంటూ శరత్, రేణుక, పాత కాంగ్రెస్ అంటూ వెంకటప్ప రంగంలోకి దిగారు. గత్పలో పాత కాంగ్రెస్ అంటూ సునీత, కొత్త కాంగ్రెస్ నుంచి మల్లమ్మ పోటీపడుతున్నారు.
ధన్వాడ మండలం గోటూర్‌లో నాగేశ్వర్‌రెడ్డి, నాగిరెడ్డిల వర్గపోరుతో తమ అనుచరులను రంగంలోకి దించారు. నాగేశ్వర్‌రెడ్డి తరఫున నాగమణి, నాగిరెడ్డి వర్గానికి చెందిన జయమ్మ పోటీపడుతున్నారు. అయితే నాగిరెడ్డి వర్గానికి బీఆర్‌ఎస్ సైతం మద్దతుగా నిలవడంతో పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. ఎంనోనిపల్లిలో కాంగ్రెస్ నేత కాశీనాథ్‌రెడ్డి తన సతీమణి దీపికను రంగంలోకి దింపగా.. అదే పార్టీకి చెందిన బోయ నాగేశ్వర్‌ను పార్టీ మండల అధ్యక్షుడు నరహరి పోరులోకి దించారు. రాంకిష్టయ్యపల్లిలో అధికార పార్టీ తరఫున సీనియర్ నాయకుడు తిరుపతి సతీమణి కవిత పోటీ చేస్తుండగా.. అదే పార్టీకి చెందిన రాఘవేందర్ తన సతీమణి శిరీషను రంగంలోకి దింపారు.
నారాయణపేట మండలంలోని జాజాపూర్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిగా బొంబాయి రాములు కుమార్తె సంగీతను రంగంలోకి దింపారు. అయితే అధికార పార్టీలో కొంతకాలంగా అంటిముట్టనట్లు ఉన్న కోట్ల జగన్మోహన్‌రెడ్డి తన అనుచరుడు అద్దాల వెంకటప్ప కోడలు అనితను పోటీలో దింపారు. ఈ గ్రామంలో ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగినా కోట్ల జగన్మోహన్‌రెడ్డి అనుచరగణం ఓవైపు.. అన్ని పార్టీలు మరోవైపు పోటీ చేస్తుంటాయి. ఇక్కడ టార్గెట్ పార్టీలు కాదు.. జగన్మోహన్‌రెడ్డి అనే చర్చ సాగుతోంది.
మరికల్ మండలం ఇబ్రహీంపట్నంలో సర్పంచ్‌గా పోటీచేస్తున్న అభ్యర్థులు రాధిక, చెన్నమ్మ ఇద్దరూ అధికార పార్టీకి చెందిన మద్దతుదారులంటూ ప్రచారానికి తెరలేపారు. దీంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఒకరిద్దరు రెబెల్స్‌గా పోటీచేసే వాళ్లను చూశాం. కానీ నారాయణపేట మండలం చిన్నజట్రంలో నలుగురు అధికార పార్టీకి చెందిన వారే సర్పంచ్ అభ్యర్థులుగా రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. అంత్వార్‌లో ఇద్దరు, బొమ్మన్‌పాడులో ఇద్దరు, అమ్మిరెడ్డిపల్లిలో ఇద్దరు అధికార పార్టీ నుంచి పోటీపడుతున్నారు.
అధికార పార్టీ మద్దతుదారులమంటూ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు కొందరు నాయకులు, కార్యకర్తలు మొహం చాటేస్తున్నారు. ఇడవమంటే పాముకు కోపం.. కొరకమంటే కప్పకు కోపమొస్తుందన్న చందంగా తమ పరిస్థితి మారిందంటూ అధికార పార్టీ నాయకులు వాపోతున్నారు. పార్టీ అధిష్టానం సైతం ఎవరికి ఏం చెప్పాలో తెలియని అంతర్మథనంలో పడిందని చెబుతున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా కాంగ్రెస్ మద్దతుదారులే కదా అంటూ నిమ్మకుండిపోతున్నారు.


