ఎన్నికల నిబంధనలు అతిక్రమించొద్దు
నారాయణపేట: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పనిచేయాలని డీఎస్పీ నల్లపు లింగయ్య సూచించారు. ఎన్నికల విధు లు నిర్వర్తిస్తున్న నారాయణపేట సర్కిల్ పోలీసులకు ఆదివారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించడంలో పోలీసు సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, ఎన్నికల కమిషన్ ఆదేశాలు, ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉంటూ.. ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టపరంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచారం.. ఓటర్లకు డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ.. బెదిరింపులు వంటి ఘటనలను గమనిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు పూర్తి రక్షణ, భద్రత కల్పించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు లోనుకావొద్దని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంచాలని.. గొడవలు జరిగితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను గమనించిన వెంటనే కేసులు నమోదు చేయాలని.. పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రచార నిషేధమని.. గుంపులు గుంపులుగా ఎవరూ ఉండకుండా చూడాలన్నారు. సీఐలు శివశంకర్, రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాముడు, రాజు తదితరులు పాల్గొన్నారు.


