మక్తల్‌ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యం
మక్తల్: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని మంత్రి నివాసంలో మక్తల్ మండలం గొల్లపల్లికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. అందులో భాగంగా ఇటీవల రూ.వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను భారీ మెజార్టీతో గెలిపించి.. గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కోరారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, నాయకులు కావాలి తాయప్ప, వేణు, సర్పంచ్ అభ్యర్థి సూర్యకుమార్, కె.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


