వేతన కష్టాలు
కోస్గి: గ్రామాలను ప్రతిరోజు శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్నారు. నెలనెలా అందాల్సిన వేతనాలు మూడు నాలుగు నెలలకోసారి అందుతుండటం, అవి కూడా సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలు పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చెల్లించాల్సిన వేతన బకాయిలను పరిశీలిస్తే ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు సంబందించిన వేతనాలు జులైలో చెల్లించారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనాలను సెప్టెంబర్‌లో రెండు నెలల వేతనాలు మాత్రమే చెల్లించారు. అప్పటి నుంచి మళ్లీ వేతనాలు అందకపోవడంతో కార్మికులకు వేతన కష్టాలు తప్పడం లేదు.
వేతనాలు అందకున్నా.. నిత్యం పనుల్లోనే
ప్రభుత్వం వేతనాలు సక్రమంగా ఇవ్వకపోయిన పారిశ్ధ్యు కార్మికులు మాత్రం పంచాయతీల్లో అందుబాటులో ఉంటూ నిత్యం తమకు కేటాయించిన పనులు చేస్తున్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం గతంలో ప్రతి గ్రామానికి పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. జనాభాను బట్టి చిన్న పంచాయతీల్లో 8 నుంచి 10 మందిని, పెద్ద పంచాయతీల్లో 10 నుంచి 20 మంది వరకు కార్మికులను నియమించింది. కార్మికులు రోజు మురికి కాలువలను శుభ్రం చేయడంతోపాటు గ్రామాల్లో శుభ్రతకు సంబందించిన పనులు చేస్తున్నారు. గతంలో పంచాయతీలకు వచ్చే పన్నులు, ఇతర నిధుల నుంచి కార్మికుల వేతనాలు అందించే వారు. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండటంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం, మిషన్ భగీరథతో నీటి పన్ను నిలిపి వేయడంతో పంచాయతీలు నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పంచాయతీలకు నిధులు రాకపోవడంతో కార్మికులకు నెలనెల వేతనాలు ఇవ్వలేక, కార్మికుల వేతనాల కోసం ప్రభుత్వం అందించే నిధులపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.
కేంద్రీకృత విధానంతో..
పారిశుద్ధ్య కార్మికులకు సంబందించి ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ప్రతిసారి ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ట్రెజరీలకు బిల్లులు పంపి కార్మికులకు వేతన చెల్లింపులు జరిపేవారు. కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం కేంద్రీకృత విధానం అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం అమలు చేయడం ద్వారా పారిశుద్ధ్య కార్మికుల నియామకాలు, వేతనేతర ఖర్చుల పేరుతో నిధులను డ్రా చేయడం నిరోధించి ప్రతినెల నేరుగా కార్మికుల ఖాతాల్లోకి వేతనాలు అందిచాలనేది కేంద్రీకృత విధానం ప్రధాన లక్ష్యం. టీజీబీపాస్‌లో నమోదైన కార్మికుల ఖాతాల్లోకి ప్రతినెల వేతనాలు జమ చేయాల్సి ఉండగా నిధులు లేని కారణంగా నూతన విధానం సైతం కార్మికులను ఆదుకోలేకపోతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు సక్రమంగా అందని జీతాలు
ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు
కేంద్రీకృత విధానంతో తప్పని తిప్పలు
జిల్లాలో 276 పంచాయతీల్లో 840 మంది కార్మికులు
వేతన కష్టాలు


