కార్తీక శోభ
● భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
● కనులపండువగా శివపార్వతులకల్యాణోత్సవం
నారాయణపేట: శివనామస్మరణ ఓ వైపు.. దీపోత్సవ కార్యక్రమాలు మరోవైపు.. కార్తీక పౌర్ణమి నాడు ఆధ్యాత్మిక వెలుగులతో ఆలయాలు కిటకిటలాడాయి. బుధవారం జిల్లా కేంద్రంలోని లింగయ్య గుడి, బారంబావి శివాలయం, అనంతసేన ఆలయం, శ్రీరాఘవేంద్ర స్వామి ఆలయం, శక్తిపీఠం, మద్దూరులోని కాచువాగు శివాలయం, కల్లపు శివాలయం, కన్యకాపరమేశ్వరీ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. నదుల వద్ద స్నానాలు ఆచరించిన అనంతరం అక్కడే వివిధ ఆకృతులలో దీపాలను వెలిగించారు. ఉసిరికాయలపై ఆవునెయ్యితో తడిపి వత్తులు వెలిగించారు. అరటిపండు, వడపప్పు, పిండిప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు.
శివపార్వతుల కల్యాణం
శక్తిపీఠం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం, కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రముఖ కృష్ణయాజుర్వేద స్మార్త పండితులైన బ్రహ్మశ్రీ ఊట్కూర్ విభావాసు అగ్నిహోత్రి పురోహిత్ చేతులమీదుగా వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం శక్తి పీఠం వ్యవస్థాపకులు స్వామి శాంతానంద పురోహిత్ భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. సామూహిక కార్తీకదీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ శివపార్వతుల దివ్య కృపతో ప్రతి భక్తుడు శాంతి సౌభాగ్యం సంతోషం పొందాలన్నారు.
కార్తీక శోభ
కార్తీక శోభ
కార్తీక శోభ


