
బాధితులకు నష్టపరిహారం అందించాలి
నారాయణపేట: ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో షెడ్యూల్డ్ కులాలు తెగల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ డా.వినీత్‌తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కేసులను పోలీసు అధికారులు సీరియస్‌గా తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి పోలీసుశాఖ పరంగా పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. 2023లో 31, 2024లో 34, 2025లో ఇప్పటివరకు 13 ఎస్సీ, ఎస్టీ కేసులు జిల్లాలో నమోదయ్యాయని తెలిపారు. వాటిలో 13 కేసులకు గాను 3 కేసులు చార్జీషీట్‌కు సిద్ధంగా ఉన్నాయని.. మిగతావి విచారణ దశలో ఉన్నాయన్నారు. మరికొన్ని కేసులకు సంబంధించి డాక్యుమెంట్స్ రావాల్సి ఉందన్నారు. అదే విధంగా ప్రతినెలా పౌరహక్కుల దినం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, మూడేళ్ల కాలంలో 54 కేసులకు సంబంధించిన నష్టపరిహారం బడ్జెట్ మంజూరు లేకపోవడంతో అందించలేకపోయామని సీ–సెక్షన్ అధికారి రాణిదేవి చెప్పారు. బడ్జెట్ వచ్చిన వెంటనే రెండు వారాలకోసారి నష్టపరిహారం చెల్లించే విధంగా చూస్తామన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకుడు కిష్ట్యా నాయక్ పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, షెడ్యూల్డ్ కులాలు తెగల అభివృద్ధిశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీఎంహెచ్‌ఓ డా.జయచంద్రమోహన్, డీపీఓ సుధాకర్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ అధికారి జనార్దన్ ఉన్నారు.
భూ సేకరణ పనుల్లో వేగం పెంచండి
ఊట్కూరు: మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఊట్కూరు మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మక్తల్–పేట ఎత్తిపోతల పథకం భూ సేకరణకు సంబంధించి రైతుల జాబితాను త్వరగా సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని.. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందేలా చూడాలన్నారు. భూభారతి దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహపీల్దార్ చింత రవి, ఎంపీడీఓ లక్ష్మీనర్సింహ రాజు, ఆర్‌ఐ కృష్ణారెడ్డి, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.