
నేటి నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
నారాయణపేట: విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడి వీరమరణం పొందిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకునేందుకు గాను గురువారం నుంచి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ డా.వినీత్ బుధవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 23న పోలీస్‌స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి.. విద్యార్థులకు పోలీసుల పనితీరు, విధులు తదితర విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. 24న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, పౌరులకు షార్ట్ ఫిలీమ్స్, ఫొటోగ్రఫీ కాంపిటీషన్ (పోలీస్ సేవలపై) నిర్వహించి.. 25న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేయాలన్నారు. 26న పబ్లిక్ ప్రదేశాల్లో మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శనలు, పోలీసు కళాబృందం ద్వారా సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 27, 28 తేదీల్లో పోలీసు అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రత్యేక ప్రజల ఫెల్ట్ నీడ్స్ సేకరణ, దేశభక్తిని పెంపొందించడం వంటివి నిర్వహించాలన్నారు. 29న జిల్లాలో అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించడం, 30న సైకిల్ ర్యాలీ, 31న రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నేడు జిల్లా మహాసభలు
నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రంలోని లక్ష్మీ ఫంక్షన్‌హాల్‌లో గురువారం ఆశావర్కర్ల యూనియన్ మహాసభలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాలరాం, ఆశావర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలామణి తెలిపారు. బుధవారం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన మేరకు ఆశావర్కర్లకు కనీస వేతనం రూ. 18వేలు ఇవ్వడంతో పాటు పనిభారం తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా మహాసభల్లో ఆశావర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
మార్కెట్ కళకళ..ధాన్యం సీజన్ ప్రారంభం
దేవరకద్ర/జడ్చర్ల: ధాన్యం సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ మార్కెట్ యార్డులు కళకళలాడుతున్నాయి. వానాకాలం పంట కింద సాగు చేసిన వరి కోత దశకు రావడంతో చాలామంది రైతులు కోతలు ప్రారంభించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరి పంట రికార్డు స్థాయిలో సాగైంది. ఒక్క కోయిల్‌సాగర్ ఆయకట్టు కింద దాదాపు 40 వేల ఎకరాల వరి సాగుచేశారు. అలాగే చెరువులు, బావుల కింద అదనంగా వరి పంట వేశారు. దిగుబడులు కూడా బాగా వస్తుండడంతో మార్కెట్‌లో సీజన్ జోరుగా సాగే అవకాశం ఉంది. దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,121, కనిష్టంగా రూ.2,079గా ధరలు లభించాయి. హంస ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,803, కనిష్టంగా రూ.1,757గా ధరలు నమోదయ్యాయి. ఆముదాలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,804, కనిష్టంగా రూ.5,779గా ధరలు పలికాయి. మార్కెట్‌కు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. బాదేపల్లి మార్కెట్‌లో పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,769, కనిష్టంగా రూ.6,521 ధరలు లభించాయి. మొక్కజొన్న గరిష్టంగా రూ.2,041, కనిష్టంగా రూ.1,600, వేరుశనగ రూ.4,331 ధరలు పలికాయి.