
మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
నారాయణపేట: మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువులో 1.83లక్షల చేపపిల్లలను వదిలారు. అదే విధంగా ఆర్డీఓ కార్యాలయంలో నారాయణపేట మండలం, పట్టణానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో జిల్లాలోని 60 నీటివనరుల్లో 80–100 ఎం.ఎం.సైజ్ 80లక్షల చేపపిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. గతంలో చేపపిల్లలు దూరం ప్రాంతాల నుంచి వచ్చేవని.. ప్రస్తుతం వనపర్తి జిల్లా నుంచి వచ్చాయన్నారు. నియోజకవర్గంలో రూ. 150కోట్లతో బీటీరోడ్లు నిర్మించనున్నట్లు వివరించారు. మరికల్ నుంచి మినస్‌పూర్ వరకు బీటీరోడ్డు మంజూరైనట్లు తెలిపారు. ముదిరాజ్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. 69 జీఓ ద్వారా జిల్లాలో రెండు పెద్ద రిజర్వాయర్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. నారాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 15కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రహిమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, వైస్‌చైర్మన్ కోనంగేరి హన్మంతు, మత్స్యసహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, ఆర్టీఏ మెంబర్ పోశల్ రాజేశ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.