
డ్రగ్స్ రహిత జిల్లానే లక్ష్యం
● సివిల్ తగదాల్లో పొలీసుల జోక్యం ఉండొద్దు
● మీడియా చిట్‌చాట్‌లో ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట: ‘డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ – డ్రగ్స్ ఫ్రీ నారాయణపేట’ లక్ష్యంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ స్పష్టం చేశారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ కట్టుబడి ఉందన్నారు. కమ్యూనల్ గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సివిల్ తగాదాల్లో పోలీసు జోక్యం లేకుండా న్యాయపరమైన పరిష్కారాలకే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి
జిల్లాలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా సిబ్బంది నియామకం చేయడంతో పాటు నూతన సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్‌డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. రాత్రి పూట పెట్రోలింగ్ పెంచి దొంగతనాలను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో శాశ్వత బోర్డర్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయడం ద్వారా చట్టవిరుద్ధ రవాణాను నియంత్రిస్తామని పేర్కొన్నారు.
డయల్ యువర్ ఎస్పీ
జిల్లాలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం చేపడుతామని, జిల్లా పరిధిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి త్వరలో క్యూఆర్ కోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు పోలీసు విభాగానికి సహకరించాలని, ఏవైనా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలు, యువతులు పడుతున్న ఇబ్బందులు, ప్రధాన చౌరస్తాలో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యలను విలేకరులు ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. దుకాణాల ఎదుట ఉన్న ఫుట్‌పాత్‌ల యజమానులు సామగ్రి పెడుతుండడంతో వాహనదారులు, పాదాచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. పలు చాయ్ సెంటర్లలో పొగ తాగడం, గంజాయి గుంజుతున్నట్లు తెలుస్తోందని ఎస్పీ దృష్టికి తెచ్చారు. అయితే ఏదైనా సమాచారం ఇస్తే పోలీసు అధికారులు, సిబ్బంది తమ పేర్లు బయటపెడుతున్నరని, అందుకే ఎవరై నా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటే భయపడే పరిస్థితి ఉందని ఎస్పీకి తెలియజేశారు. ఇందుకు స్పందించిన ఎస్పీ వాటన్నింటిని నోట్ చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలిగిన తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. వారి విషయాలు గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు.