
టీకాలతో పశువుల్లో రోగనిరోధక శక్తి
నారాయణపేట: పశువులకు సకాలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాహర్‌పేటలో బుధవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం ఇటీవలే ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించిందని, ఆ పథకం కింద రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు జనగామ, నాగర్‌కర్నూల్, గద్వాలతో పాటు నారాయణపేట జిల్లాను ఎంపిక చేసిందని గుర్తు చేశారు. అయితే పథకంలో పశుసంవర్ధక, డైరీ, ఫిషరీస్‌తో పాటు 11 వ్యవసాయ అనుబంధ శాఖల్లోని పారామీటర్ల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు లక్ష డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని, అన్ని గ్రామాల్లోని పశువులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, జిల్లా పశువైద్యాధికారి బి.ఈశ్వర్‌రెడ్డి, వైద్యాధికారులు అనిరుధ్‌చారి, రాఘవేంద్రగౌడ్, శ్రీనివాస్, బీకేఎస్ జోనల్ కార్యదర్శి వెంకోభ తదితరులు పాల్గొన్నారు.