
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
నారాయణపేట రూరల్: అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ బాలిక దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. బాలికలు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, చదువు మధ్యలో మానకూడదన్నారు. బాల్య వివాహాలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాజంలో సీ్త్ర పాత్ర చాలా కీలకమని, యువకుల చేతిలో ప్రేమ పేరుతో మోసపోరాదని, పెళ్లి విషయంలో అన్ని ఆలోచించి ముందడుగు వేయాలన్నారు. అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ 1098 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, అన్ని రకాల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మీపతి, నందు నామాజీ, తిరుపతయ్య, పోలీస్ అధికారులు బాలస్వామి, రూపిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎస్పీని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు
నారాయణపేట: జిల్లా నూతన ఎస్పీ డాక్టర్ వినీత్‌ని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆకుల బాలప్ప, మేనుశ్రీ, ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ, న్యాయ వ్యవస్థ మధ్య సత్సంబంధాలు కొనసాగి కేసులు త్వరితగతిన పరిష్కారం కావడంలో సమన్వయం కీలకమన్నారు. న్యాయ వ్యవస్థలో పీపీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, వారితో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
మిమిక్రీ పోటీలో విద్యార్థి ప్రతిభ
మరికల్: మండలంలోని లాలోకోట చౌరస్తాలో ఉన్న గ్లోబల్ స్కూల్ విద్యార్థి సాయి త్రినయన్ హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి టాలెంట్ ఫెస్ట్ మిమిక్రీ విభాగంలో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి అందుకున్నాడు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ పోటీలో విద్యార్థి అసమాన ప్రతిభ చాటడంతో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి వచ్చినట్లు కరస్పాడెంట్ పల్లె జైపాల్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు అదుకున్నాడు.
చౌడేశ్వరిదేవి అఖండ జ్యోతి ఉత్సవాలు
కోస్గి: తోగుట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో చౌడేశ్వరీ దేవి అఖండ జ్యోతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇసుకబావి సమీపంలో వెలసిన అమ్మవారి ఆలయం నుంచి చౌడేశ్వరీ దేవి అఖండ జ్యోతులను పట్టణంలోని పుర వీధుల గుండా ఊరేగింపు ప్రత్యేక వస్త్రాలంకారణ చేపట్టి ఆటపాటలు, నృత్యాలతో ఆలయానికి చేర్చుతారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం, మహామంగళహరతి, భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో వెంకటేష్, శశిధర్, అజయ్‌కుమార్, శ్రీనివాస్, బాల్‌రాజ్, నర్సిములు, లక్ష్మీనారాయణ, విజయ్‌కుమార్, శాంతికుమార్ తదితరులు ఉన్నారు.

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి