
ఉద్యమానికి ఊపిరి..
ఆత్మకూర్ పల్లెల్లో రాజుకున్న చైతన్యం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1947 అక్టోబర్ 7న భారీ ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు మహబూబ్‌నగర్ నుంచి అదనపు పోలీసు బలగాలను అప్పంపల్లికి తరలించారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్న, బలరాంగౌడ్, తంగెడి నాగిరెడ్డి, తెలుగు ఆశన్నలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏక్షణంలోనైనా తమ నేతలను అరెస్టు చేస్తారని భావించిన అప్పంపల్లి గ్రామస్తులు రావిచెట్టు కింద గుమిగూడి చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు భాష్పావాయువు ప్రయోగించారు. విడిది చేసిన ఇంటి కిటికీలో నుంచి ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 11 మంది చాకలి కుర్మయ్య, ఈశ్వరయ్య, తంగేటి రాంరెడ్డి, నన్నేమ్మ, హరిజన్ కిష్టన్న, హరిజన్ తిమ్మన్న, లక్ష్మారెడ్డి, పెండేం సాయన్న, గజ్జలన్న, బాల్‌రెడ్డి, వడ్డేమాన్ నర్సయ్య అక్కడికక్కడే నేలకొరగగా.. భీంరెడ్డి, మాల కిష్టన్న, ఈడిగి తిమ్మక్క, పెండెం కుర్మన్న, కె.రామచంద్రయ్య, వాగుల గంగన్నతోపాటు మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 29 మందిపై పోలీసులు చార్జీషీట్ వేసి జైలులో నిర్బంధించారు.