
ప్రజాపాలన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
నారాయణపేట/నారాయణపేట రూరల్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరై జాతీయ పతాకం ఆవిష్కరిస్తారని తెలిపారు. వేడుకల నిర్వహణలో భాగంగా అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కలెక్టరేట్ ఏఓ జయసుధ, ఆర్డీఓ రామచందర్ నాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య తదితరులు ఉన్నారు.
● ఇటీవల శ్రీహరి కోట (ఇస్రో)ను సందర్శించిన ఉపాధ్యాయులు అక్కడి విషయాలను తమ పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా సైన్స్ ఫోరం సభ్యులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెన్స్ ఫోరం మరింత సమర్థవంతంగా పనిచేయాలని.. శాస్త్ర సాంకేతిక నైపుణ్యలపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగేలా కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్ వారికి సూచించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, సైన్స్ ఫోరం సభ్యులు వార్ల మల్లేశం, రాములు, యాదయ్యశెట్టి పాల్గొన్నారు.
‘విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దు’
నారాయణపేట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటోందని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. స్థానిక భగత్‌సింగ్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకానికి ప్రస్తుత పాలకులు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు అజయ్, వెంకటేశ్, సురేశ్, రాజు, గణేశ్, అనూష, పౌర్ణమి, అనురాధ, శివకుమారి, సుధాకర్ ఉన్నారు.
వేరుశనగ @ రూ.4,110
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 159 క్వింటాళ్ల విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ. 4,110, కనిష్టంగా రూ. 2,719 ధరలు లభించాయి. అదే విధంగా 56 క్వింటాళ్ల ఆముదాలు విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 6,059, కనిష్టంగా రూ. 5,539, సరాసరి రూ. 6059 ధరలు వచ్చాయి.

ప్రజాపాలన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి