
మహిళా ఆరోగ్యానికి రక్ష
● రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్యశిబిరాలు
● ప్రతి రోజు మూడు మండలాల్లో స్పెషలిస్టులతో పరీక్షలు
నర్వ: నిత్యం ఇంటా బయట పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళల ఆరోగ్యానికి మరింత భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా ప్రతి మహిళకు అన్నిరకాల వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వైద్యశిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ మా కార్యక్రమానికి అనుసంధానంగా మహిళలకు వైద్యపరీక్షలు నిర్వహించి.. అనారోగ్య సమస్యలను గుర్తించనున్నారు. వారికి అవసరమైన మందులు అందించడంతో పాటు మెరుగైన చికిత్స అవసరమైన వారిని ఉన్నత శ్రేణి ఆస్పత్రులకు పంపించనున్నారు. జిల్లాలోని పల్లె దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిర్వహించే పరీక్షలు..
వైద్య కళాశాలల్లో పనిచేసే గైనకాలజీ, కంటి, చెవి, ముక్కు గొంతు, చర్మ, మానసిక, దంత వైద్యనిపుణులు పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), క్యాన్సర్ స్క్రీనింగ్ (ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్), టీబీ పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళలకు రక్తహీనత సమస్య ఉంటున్నందున.. దీనిపై యుక్త వయసులోని అమ్మాయిలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. గిరిజన తండాల్లో సికిల్ సెల్, ఎనీమియా పరీక్షలు చేసి, తగిన జాగ్రత్తలు వివరిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి..
జిల్లాలో 15 రోజులపాటు మహిళల ఆరోగ్య సంరక్షణకు నిర్వహించే వైద్యశిబిరాల ను సద్వినియోగం చేసుకోవాలి. శిబిరాల్లో టీబీ, బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్, తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా వంటి పరీక్షలు నిర్వహించి.. తగిన మందులు ఇస్తారు. మెరుగైన చికిత్స అవసరమైన వారిని ఉన్నత శ్రేణి ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు. దీంతో పాటు రక్తదాన శిబిరాలు, టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాల ద్వారా దాతలచే పౌష్టికాహారం అందిస్తారు.
– జయచంద్రమోహన్, డీఎంహెచ్‌ఓ

మహిళా ఆరోగ్యానికి రక్ష