
సాయుధ పోరాటంలో.. పాలమూరు మట్టిబిడ్డలు
చిన్నచింతకుంట: ఆ ఊరి పొలిమెరలోకి అడుగుపెట్టగానే మాయని గాయమేదో బాధపెడుతుంది.. పల్లెలోకి పాదం మోపగానే ఉద్వేగ క్షణాలేవో తట్టిలేపుతాయి.. ఆ గ్రామం పేరు చూడగానే అమరుల త్యాగాలు యాదికొస్తవి. నేటికీ సాక్ష్యంగా మిగిలిన రావి చెట్టు, నాటి ఘటనను గుర్తు చేసి మనసును కకాలవికలం చేస్తుంది.. ఆ కిటికీ నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లుగానే ఉంటుంది.. రజాకార్ల రాక్షస క్రీడ గుర్తుకొచ్చి రక్తం సలసలా మరుగుతుంది.. వారి బూటు కాళ్ల చప్పుళ్లు.. పోరాట ఘట్టాలు కథలు కథలుగా వినిపిస్తాయి. చిందిన అమరుల రక్తం.. స్తూపమై మొలిచి వారి త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపుతుంది.. తొలుస్తున్న గాయాని దిగమింగుకుని.. వీరులను గుర్తించని వైనాన్ని తలుచుకుని.. ధుఃఖిస్తోంది అప్పంపల్లి గ్రామం..
రజాకార్లపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ప్రాణాలు కోల్పోయిన అప్పంపల్లి అమరవీరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపునకు నోచుకోలేకపోయారు. స్వాతంత్య్ర పోరాటం.. నిజాం వ్యతిరేక పోరాటం వేర్వేరు అని భావించిన ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకుంటూ.. మరోవైపు నిజాం పోలీసు మూకలు సాగించిన అరాచకాలను ఎదురించి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు గుర్తించాలి. దుర్భర స్థితిలో ఉన్న అప్పంపల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవానికి నిజమైన సార్థకత లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తల్లడిల్లిన అప్పంపల్లి
అమరవీరులకు గుర్తింపేది?