
యూరియా కోసం మళ్లీ రోడ్డెక్కిన రైతులు
● టోకెన్లకు సైతం ఇబ్బందులుతప్పడం లేదని ఆందోళన
● పంటలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్
నారాయణపేట: యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. యూరియా దొరక్క కొందరు, టోకెన్లు లభించక మరికొందరు రైతులు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా – బస్టాండ్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. యూరియా కోసం నిత్యం అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. యూరియా, టోకెన్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాసినా దొరకడం లేదని వాపోయారు. వానాకాలంలో వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన పంటలకు యూరియా వేయకపోవడంతో ఎదగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ రాములు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
అరకొర పంపిణీపై ఆగ్రహం
నారాయణపేట రూరల్: మండలంలోని సింగారం రైతువేదికలో అరకొరగా యూరియా టోకెన్లు పంపిణీ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవానికి వివిధ గ్రామాల రైతులు తెల్లవారుజామునే నారాయణపేటలోని పీఏసీఎస్ కార్యాలయానికి యూరియా కోసం వెళ్లారు. అయితే తమ క్లస్టర్ పరిధిలోని రైతువేదికల్లోనే టోకెన్లు ఇస్తారని అధికారులు చెప్పడంతో సింగారం రైతువేదిక వద్దకు చేరుకొని బారులు తీరారు. ఈ క్రమంలో ఏఈఓ అనిల్‌కుమార్ కేవలం 50 టోకెన్లు ఇచ్చి వెళ్లిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై ఏఓ దినకర్ స్పందిస్తూ.. యూరియా స్టాక్ మేరకు రైతులకు టోకెన్లు అందిస్తున్నట్లు తెలిపారు.

యూరియా కోసం మళ్లీ రోడ్డెక్కిన రైతులు