
పేట–కొడంగల్ భూసేకరణ ప్రక్రియ వేగవంతం
● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్: నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి రాంలీలా మైదానంలో చేపట్టిన కోనేరు ఆధునికీకరణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి రూ.4,500 కోట్లతో పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకం పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో 1.25లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న వారికి ఎకరాకు రూ. 20లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. మక్తల్ సెగ్మెంట్‌లో 800 ఎకరాలకు గాను 600 ఎకరాలకు రైతులు ఒప్పంద పత్రాలు సమర్పించినట్లు చెప్పారు. మిగతా రైతుల నుంచి ఒప్పంద పత్రాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా పథకం పనులు ప్రారంభిస్తామన్నారు. కాగా, మక్తల్‌లో పడమటి ఆంజనేయస్వామి జాతరలోగా కోనేరు ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తామని మంత్రి చెప్పారు. అతి పురాతనమైన కోనేరును సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రాణేశ్‌కుమార్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, కావలి తాయప్ప, రవికుమార్, ఈఓ శ్యాంసుందర్ ఆచారి, రవికుమార్, కట్ట సురేశ్, నాగశివ, హేమసుందర్, అరవిందు, డీవీ చారి పాల్గొన్నారు.