
నా జీవితం ప్రజా సేవకు పునరంకితం
నారాయణపేట: తన జీవితం ప్రజా సేవకే పునరంకితమని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం తన జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని లింగయ్య, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని శివకుమార్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు అందించే పరిహారాన్ని రూ. 20లక్షలకు పెంచిన సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత బిడ్డ రేవంత్‌రెడ్డి సీఎం కావడంతోనే భూ నిర్వాసితులకు ఎకరానికి రూ. 20లక్షలకు పరిహారం పెంచడంతో పాటు మరో రూ. 300కోట్ల ప్రాజెక్టుకు ఎక్కువ అయినా సాధించడం జరిగిందన్నారు. అదే విధంగా వికారాబాద్–కృష్ణా రైల్వేలైన్ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి దృఢ సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేయించినట్లు చెప్పారు. జాయమ్మ చెరువుకు సాగునీరు తీసుకురావడం సీఎన్‌ఆర్ కల అని.. నియోజకవర్గంలోని ప్రతి చెరువును నీటితో నింపేందుకు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కృషి చేస్తున్నారన్నారు. పర్ణికారెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించి స్పీకర్ సీటులో కూర్చొబెట్టడమే తన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్.శివారెడ్డి, వైస్‌చైర్మన్ కొనంగేరి హన్మంతు, మాజీ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కోట్ల రవీందర్‌రెడ్డి, నాయకులు రాజీరె డ్డి, రఘుబాబు, ఎండీ సలీం పాల్గొన్నారు.