
పరిహారం పెంపు చారిత్రాత్మక నిర్ణయం
● ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపినమంత్రి, ఎమ్మెల్యే
నారాయణపేట: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఎకరాకు రూ.20 లక్షల పరిహారం చెల్లింపునకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో శనివా రం మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మె ల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ఆవేదనను అర్థం చేసుకొని వారికి న్యాయం జరిగేలా పరిహారం పెంచుతూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో నారాయణపేట, కొడంగల్, మక్తల్ ప్రాంత రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటుందన్నారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలతో సస్యశ్యామలంగా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.